Kerala: చిన్నారి 'పేరు' కోసం కోర్టుకెక్కిన తల్లిదండ్రులు.. ట్విస్ట్ ఏంటంటే..

Update: 2023-10-02 03:00 GMT

తల్లిదండ్రుల మధ్య విబేధాల కారణంగా.. ఓ చిన్నారి నామకరణం ఆగిపోయింది. తండ్రి.. తనకు నచ్చిన పేరుతో కూతురిని పిలిస్తే.. తల్లి ఆ పేరు నచ్చలేదంటూ మరో పేరు పెట్టింది. ఈ విషయంలో కూడా ఇద్దరి మధ్య గొడవలై.. చివరకు హైకోర్టు వరకూ చేరింది. అయితే కోర్టే.. ఆ చిన్నారికి నామకరణం చేసి భార్యాభర్తలిద్దరికీ షాక్ ఇచ్చింది.

కేరళకు చెందిన ఆ దంపతులకు 2020 ఫిబ్రవరిలో ఓ కుమార్తె పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య ఏదో విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఇంకా విడాకులు తీసుకోలేదు కానీ.. ఈ మనస్పర్థల వల్లే ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. పాప మాత్రం తల్లి వద్దే ఉంటోంది. గతంలో చిన్నారికి జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్‌లో పేరు లేకపోవడం వల్ల.. ఓ పేరు నమోదు చేసేందుకు ఆమె తల్లి ప్రయత్నించారు. పేరు నమోదుకు కచ్చితంగా తల్లిదండ్రులిద్దరూ హాజరు కావాలని సంబంధిత అధికారి స్పష్టం చేశారు. దీంతో దంపతులిద్దరూ ఆ చిన్నారికి వేర్వేరు పేర్లు సూచించారు. అయితే సర్టిఫికెట్ జారీ చేసే అధికారి.. ఏదో ఒక పేరు మాత్రమే ఉండాలని, ఆ పేరే సూచించాలని చెప్పారు. తమ కూతురి పేరు విషయంలో ఇద్దరూ పట్టు వీడకపోవడం వల్ల.. వ్యవహారం మళ్లీ మొదటకు వచ్చింది. దంపతులిద్దరూ గొడవపడ్డారు. చేసేదేం లేక చిన్నారి తల్లి.. కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. చిన్నారికి పేరు పెట్టి భార్యాభర్తలిద్దరికీ ట్విస్ట్ ఇచ్చారు.

జస్టిస్‌ బెచు కురియన్‌ థామస్‌ కోర్టు అధికార పరిధిని వినియోగించుకొని ఆ పాపకు నామకరణం చేసింది. తల్లి సూచించిన పేరుతోపాటు తండ్రి పేరునూ జత చేసి.. పాపకు ఓ పేరును ఫైనల్ చేసింది. ఆ పేరునే ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భర్త అయినా, భార్య అయినా ఇకపై చిన్నారిని ఆ పేరుతోనే పిలవాలని సూచించింది.

Tags:    

Similar News