GPS: జోరు వానలో జీపీఎస్‌ను నమ్ముకుని ప్రయాణం.. ప్రాణాలు పోయాయ్

Update: 2023-10-02 07:27 GMT

అర్ధరాత్రి, జోరు వాన, తెలియని రహదారి.. చీకటిలో రూట్ తెలియక.. జీపీఎస్ నమ్ముకున్నారు ఆ కారులో ఉన్న యువ డాక్టర్లు. ఆదివారం తెల్లవారుజామున కొచ్చిలో పుట్టినరోజు వేడుకల నుండి బయల్దేరిన అ మిత్ర బృందం.. త్వరగా ఇంటికి చేరుకోవాలని భావించింది. రోడ్డుపై వస్తున్న వరదను గమనించి.. డ్రైనేజ్ వాటర్ గా భావించి కారును వేగంగా పోనిచ్చారు. కానీ ఆ కారు నదిలోకి దూసుకెళ్లడంతో.. డాక్టర్ అద్వైత్‌ తో పాటు మరో డాక్టర్ కూడా నీటమునిగి మృతి చెందారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో చోటు చేసుకొంది. గోతురుత్ ప్రాంతంలో అర్ధరాత్రి 12:30 గంటలకు జరిగిన ఈ దుర్ఘటన వారి స్నేహితులు, సన్నిహితులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

కొల్లాంకు చెందిన డాక్టర్‌ అద్వైత్‌ (29), త్రిశూర్‌కు చెందిన డాక్టర్‌ అజ్మల్‌ (29) ఓ ప్రైవేటు హాస్పిటల్ లో పనిచేస్తున్నారు. వీరు శనివారం రాత్రి ఓ బర్త్ డే పార్టీకి హాజరై తిరిగి ఇళ్లకు బయల్దేరారు. వీరితోపాటు డాక్టర్‌ తబ్సిర్‌, ఎంబీబీఎస్‌ విద్యార్థిని తమన్నా, నర్స్‌ జిస్మాన్‌ కూడా హోండా సివిక్‌ కారులో ఎక్కారు. అద్వైత్‌ డ్రైవింగ్‌ సీట్లో కూర్చొన్నాడు. ప్రయాణ సమయంలో భారీ వర్షం పడుతుండటంతో రోడ్డు మార్గం సరిగా కనిపించడంలేదు. అద్వైత్‌ జీపీఎస్‌ అనుసరించి డ్రైవింగ్‌ చేస్తున్నట్లు అతడి పక్కన కూర్చొన్న ఎంబీబీఎస్‌ విద్యార్థిని తమన్నా చెప్పింది. ఈ క్రమంలో జీపీఎస్‌ రీరూటైంది.

దానిని ఫాలో అయిన అతడు మార్గం మధ్యలో నీరు నిలిచి ఉన్న ప్రాంతాన్ని రోడ్డుగా భ్రమించాడు. కారును నేరుగా నీటిలోకి తీసుకెళ్లాడు. అది నది అని గుర్తించేలోపే వారి కారు నీటిలో మునిగిపోయింది. ఈ ఘటన అర్ధరాత్రి 12.30 సమయంలో చోటు చేసుకొంది. కారు మునిగిపోవడంతో అద్వైత్ (29),అజ్మల్ ఆసిఫ్ (29) సహాయం కోసం కేకలు వేశారు. కానీ కారు లాక్ చేసి ఉండడంతో వారు బయటకు రాలేకపోయారు. వెంటనే స్థానికులు స్పందించి కారులో ఉన్న మిగతా ముగ్గురిని రక్షించారు. తాము జీపీఎస్ ను అనుసరించి ప్రయాణం చేశామని, తాము డ్రైవింగ్ చేయనందున.. అప్లికేషన్ లో సాంకేతిక లోపం జరిగిందా, లేదంటే మానవ తప్పిదమా అని చెప్పలేమని ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తులు తెలిపారు. ప్రస్తుతం ఈ ముగ్గురిని కొచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ అద్వైత్ మృతదేహాన్ని కలమసేరి మెడికల్ కాలేజీకి, డాక్టర్ అజ్మల్ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం త్రిసూర్ మెడికల్ కాలేజీకి తరలించారు

Tags:    

Similar News