కేంద్రం కీలక నిర్ణయం..పీఎఫ్ వడ్డీరేటు పెంపు!

Update: 2024-02-10 10:29 GMT

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. 2023-24 ఆర్థిక ఏడాదికి గాను పీఎఫ్ వడ్డీ రేటును పెంచింది. దీంతో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్ఓ) వడ్డీ రేటు 8.25 శాతానికి పెరిగింది. గత కొన్ని రోజులుగా ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8 శాతానికి తగ్గించే అవకాశం ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయినప్పటికీ 8.25 శాతానికి వడ్డీ రేటును ఖరారు చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. అంతకుముందు 2021-22 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.10 శాతం ఉండేది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఈపీఎఫ్ఓ వర్గాలు ప్రకటించాయి. సీబీటీ నిర్ణయం ప్రకారంగా చూస్తే ఈపీఎఫ్ఓ తన వడ్డీ రేట్లను ప్రతి ఏడాది మారుస్తూ వస్తోంది. ఉద్యోగుల సంక్షేమం కోసం, ఆరు కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారుల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటుకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖకు నివేదిక పంపింది.

వడ్డీ రేటు పెంపుదల కోసం ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును అందిస్తూ వస్తుంటుంది. తాజాగా 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి పీఎఫ్ వడ్డీ రేటును పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా అనుమతిని ఇచ్చింది. దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వడ్డీ రేటు 8.25 శాతానికి పెరగనుంది. కేంద్రం ప్రకటనతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News