అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాం.. రెజ్లర్లకు మద్దతుగా రైతు సంఘాల ఆందోళనలు..
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు హర్యానా రైతులతో పాటు ఖాప్ పంచాయతీ పూర్తి మద్దతు ప్రకటించింది. హర్యానాలో శుక్రవారం నిర్వహించనున్న సమావేశంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ ప్రకటన విడుదల చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రపతిని కలిసేందుకు సైతం సిద్ధమని స్పష్టం చేశారు.
మరోవైపు రెజ్లర్లకు మద్దతుగా రంగంలోకి దిగిన సంయుక్త్ కిసాన్ మోర్చా దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యూపీలోని అలీగఢ్‌లో నిర్వహించిన మహా పంచాయత్‌లో పాల్గొన్న రాకేష్ టికాయిత్ రెజ్లర్లకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. పతకాలను గంగానదిలో కలపవద్దని, వాటిని వేలానికి పెట్టాలని సూచించారు. అలా చేస్తే ఈ అంశం యావత్ ప్రపంచం దృష్టికి వస్తుందని అన్నారు. అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోవద్దని రెజ్లర్లకు సూచించినట్లు రాకేష్ చెప్పారు. మరోవైపు ముజఫర్‌నగర్‌లో జరిగిన ఖాప్ మహాపంచాయతీకి పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ నుంచి రైతు నేతలు పాల్గొన్నారు.