One nation one election : జమిలిపై జోరు పెంచిన కేంద్రం..

Byline :  Kiran
Update: 2023-09-16 10:14 GMT

జమిలి ఎన్నికల నిర్వాహణపై కేంద్రం జోరు పెంచింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ముగిసిన మరుసటి రోజే ఒకే దేశం - ఒకే ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి భేటీ కానుంది. సెప్టెంబర్ 23న సమావేశం జరగనుందని కమిటీ ఛైర్మన్ మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

వన్ నేషన్ - వన్ ఎలక్షన్ కమిటీకి కోవింద్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌ సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీ ఇందులో సభ్యులుగా ఉన్నారు. కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘావాల్‌, సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్‌ చంద్రలను నియమించారు. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఎదురయ్యే సమస్యలు, వన్ నేషన్ - వన్ ఎలక్షన్ వల్ల కలిగే ప్రయోజనాలు, సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది.

మోడీ సర్కారు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ఈ స్పెషల్ సెషన్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం ఇటీవలే ప్రత్యేక సమావేశాల ఎజెండా విడుదల చేసింది. ఈ నెల 19న కొత్త పార్లమెంటు బిల్డింగ్లోకి మారుతున్న నేపథ్యంలో 18వ తేదీన 75ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం గురించి చర్చించాలని మోడీ సర్కారు నిర్ణయించింది.




Tags:    

Similar News