10 రోజుల కన్నుల పండుగ.. కేరళలో వైభవంగా ఓనం సంబురాలు

Byline :  Kiran
Update: 2023-08-29 11:16 GMT

మలయాళీలకు అతిపెద్ద పండుగ ఓనం. ఈ పండుగ సమయంలో కేరళలో వైభవంగా జరుపుకునే ఈ పండగను చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఏటా ఆగస్టు - సెప్టెంబర్ నెలల్లో వచ్చే ఈ పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 20న ప్రారంభమైన పండుగ ఈ రోజు (ఆగస్టు 29)తో ముగిసింది. కేరళతో పాటు తమిళనాడు, కర్నాటక సహా పలు రాష్ట్రాల ప్రజలు కూడా ఏటా ఈ పండుగ చేసుకున్నారు

10 రోజుల పండుగ

కేరళ సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓన‌ం. తొలి రోజును అతమ్‌గా, చివరి రోజైన 10వ రోజును తిరు ఓనమ్ అంటారు. 10 రోజుల పండుగలో ఈ రెండు రోజులు చాలా ముఖ్యమని కేరళీయులు భావిస్తారు. కేరళ సంస్కృతి సంప్రదాయాలు ప్రతీకైన ఓనంకు 1961లో జాతీయ పండగగా గుర్తింపు లభించింది. ఏటా ఓనం పండుగ సందర్భంగా మలయాళీలు బలి చక్రవర్తిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు రంగురంగుల పూలతో ముగ్గులు తీర్చిదిద్దుతారు. ఈ రోజు మహాబలి ప్రతి ఇంటికి వెళ్లి అందరి సంతోషాన్ని స్వయంగా చూస్తాడని విశ్వసిస్తారు.

బలి చక్రవర్తిని ఆహ్వానిస్తూ

పాతాళ లోకాధిపతైన బలి చక్రవర్తిని భూమిపైకి ఆహ్వానిస్తూ ఓనం పండుగ జరుపుకుంటారు. మహాబలి పాలనా కాలాన్ని మళయాలీలు స్వర్ణ యుగంగా భావిస్తారు. అందుకే రాక్షస రాజైనప్పటికీ బలి చక్రవర్తితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ 10 రోజుల పాటు మహాబలిని పాతళ లోకం నుంచి అహ్వానిస్తూ ఓనం జరుపుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ పండుగను వామన జయంతి పేరుతో జరుపుకుంటారు.

ప్రహ్లాదుని మనవడు

శ్రీ మహావిష్ణువు మహా భక్తుడైన ప్రహ్లాదుడి మనవడు బలి చక్రవర్తి. తాత ప్రహ్లాదుడిలాగే మహాబలి కూడా గొప్ప విష్ణుభక్తుడు. బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి ఇంద్రుడిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. బలి చక్రవర్తిని నిలువరించడం ఎవరి తరమూ కాకపోవడంతో దేవతలంతా శ్రీ మహా విష్ణుని శరణు వేడుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తాను అదితి అనే రుషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన వామనుడిగా జన్మిస్తాడు.

పాతాళానికి తొక్కి

రుషి కుమారుడైన వామనుడు ఓ రోజు బలి చక్రవర్తి దగ్గరకు వెళతాడు. ఆయనకు అతిధి మర్యాదలు చేసిన తర్వాత బలి చక్రవర్తి ఏం కావాలని అడుగుతాడు. దీంతో వామనుడు 3 అడుగుల స్థలాన్ని కోరతాడు. మహాబలి సరేనని మాటిస్తాడు. అప్పుడు వామనుడు భూమి మీద ఒక అడుగు, ఆకాశం మీద ఒక అడుగు పెట్టి మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడుగగా బలిచక్రవర్తి తన తలపై పెట్టాడు. దీంతో వామనుడు బలిచక్రవర్తి తలపై కాలు పెట్టి పాతాళంలోకి తొక్కేస్తాడు. అయితే బలి చక్రవర్తి దాన గుణానికి సంతోషించిన శ్రీ మహా విష్ణువు ఏటా కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునే వరం ఇస్తాడు. అలా మహాబలిని భూమ్మీదకు ఆహ్వానిస్తూ ఏటా ఓనం పండుగ జరుపుకుంటారు.




 




Tags:    

Similar News