పళ్లతో ప్రపంచ రికార్డ్ సృష్టించిన తండ్రీ కొడుకులు

Update: 2023-08-27 06:15 GMT

కూటి కోసం కోటి విద్యలు అంటారు పెద్దలు. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేందుకు, కుటుంబ బండిని ముందుకు నడిపించేందుకు ఆ ఇంటి పెద్ద చేసే పోరాటం వర్ణణాతీయం. తన భార్యా పిల్లల భవిష్యత్తు కోసం ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధపడతాడు తండ్రి. అలాంటి సాహసమే చేస్తున్నాడు ఉత్తర్‎ప్రదేశ్‎కు చెందిన 38 ఏళ్ల వికాస్ స్వామి.

రోడ్డు ప్రమాదంలో కొన్నాళ్లు మంచానికే పరిమితమైనా తనలోని శక్తినంతా పోగు చేసి మళ్లీ మామూలు మనిషయ్యాడు వికాస్. అందరికన్నా భిన్నంగా ఏదైనా చేయాలన్న తపనతో తన తెలివికి పదునుపెట్టాడు. పళ్లతో భారీ బరువులను మోసి ప్రపంచ రికార్డులను సృష్టిస్తున్నాడు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ కర్నావాల్ గ్రామంలో ఉంటున్న వికాస్ స్వామి పళ్లతో భారీ బరువులు మోస్తూ వరల్డ్ రికార్డులు నెలకొల్పుతున్నారు. 2010లో జరిగిన యాక్సిడెంట్‎లో మంచానికే పరిమితమైన వికాస్, తన స్నేహితుడి సలహా మేరకు యోగా సాధన చేసి మళ్లీ సాదారణ స్థితికి వచ్చాడు. ఇంట్లోనే యోగా చేస్తున్న వికాస్‎కు ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచన వచ్చింది. దీంతో పళ్లతో బరువులు ఎత్తడం స్టార్ట్ చేశాడు. కొద్దికాలంలోనే ఈ విద్యలో ప్రావీణ్యం సాధించాడు. 2021లో మొదటిసారిగా పళ్లతో 80 కేజీల బరువు ఎత్తి వికాస్‌ ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు’లో చోటు సంపాదించాడు. ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ వంటి ఓ ప్రముఖ టీవీ షోలో అమేజింగ్ పెర్ఫార్మెన్స్‎తో గిన్నిస్‌ రికార్డునూ సొంతం చేసుకున్నాడు.

పళ్లతో బరువులు లేపడమంటే నిలుచుని కాదు, వికాస్ లెక్కే వేరు. తలకిందులుగా చేతులపై నిలబడి ఈ సాహసం చేస్తాడు. అదే వికాస్‌ స్పెషాలిటీ. వికాస్‎కు ఆదిత్య, అన్మోల్‌ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ఆదిత్య తన 13 ఏట పళ్లతో 75 కిలోల బరువు ఎత్తి.. అన్మోల్‌ 9వ ఏట 45 కేజీల బరువు ఎత్తి పలు రికార్డులను నెలకొల్పారు. ఇళ్లు మొత్తం తండ్రీ కొడుకులు సాధించిన రికార్డులతో నిండి ఉన్నా..ఆర్థికంగా మాత్రం ఈ కుటుంబం వెనకబడే ఉంది. వీరి ఇచ్చే ప్రదర్శనలు, స్నేహితులు ఇచ్చే డబ్బులే వీరికి ఆధారంగా నిలుస్తోంది. సర్కార్ స్పందించి కాస్త ఆదుకుని ఉపాధి కల్పించాలని వికాస్‌ కోరుతున్నాడు.

Tags:    

Similar News