బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం "భారతరత్న" అందజేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా పేరొందిన అద్వానీ కొన్ని దశాబ్దాల పాటు పాలిటిక్స్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం వయోభారం కారణంగా ఆయన ఇంటికే పరిమితమైనా దేశానికి అద్వానీ చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇక ఈ పురస్కారం దక్కడంపై ఆయన తొలిసారి స్పందించారు.
ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా తన ఆదర్శాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు అద్వానీ తెలిపారు. ‘‘ఆర్ఎస్ఎస్లో చేరిన నుంచి దేశం కోసం నాకు అప్పగించిన పనులను అంకితభావంతో చేశాను. ఈ జీవితం నాది కాదు.. నా జీవితం దేశం కోసం అన్నది నా జీవితాన్ని ప్రేరేపించింది. ఈ సమయంలో నేను సన్నిహితంగా మెలిగిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, వాజ్పేయిలను కృతజ్ఞతతో స్మరించుకుంటున్నాను. అదేవిధంగా నా వెంట నిలిచిన పార్టీ కార్యకర్తలు సహా ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నా కుటుంబసభ్యులు, ముఖ్యంగా నా భార్య కమలకు ధన్యవాదాలు. వీరంతా ఎల్లవేళలా నాకు అండగా నిలిచారు. ఇక ఈ పరస్కారం అందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలకు ధన్యాదాలు’’ అని అద్వానీ అన్నారు. అదేవిధంగా ఈ పురస్కారం దక్కడంపై తన తండ్రి బాగా ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారని అద్వానీ కూతురు తెలిపారు.
1991లో అద్వానీ గుజరాత్లోని గాంధీనగర్, న్యూఢిల్లీ నుంచి పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించారు. 2009లో ఆరోసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన.. ఆ ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 15 డిసెంబర్ 2009న జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా మారారు. 2014లో 16వ లోక్ సభకు ఎన్నికైన ఎల్కే అద్వానీ ఆ తర్వాత పదవులన్నింటీకీ రాజీనామా చేశారు. వయోభారం కారణంగా క్రియాశీలకు రాజకీయాలకు దూరమయ్యారు.
అయోధ్యలో రామమందిర పోరాటంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు. 90వ దశకంలో రామమందిర ఉద్యమానికి అద్వానీ, మురళీ మనోహర్ జోషి ముందుండి నడిపించారు. ఎల్‌కే అద్వానీ నేతృత్వంలో 1990 లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి అయోధ్యలోని రామ జన్మభూమి వరకు బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. మందిర్ వహీ బనాయేంగే నినాదంతో అద్వానీ రామమందిర ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. బీహార్లో ఆ యాత్రను అడ్డుకున్న లాలూప్రసాద్ యాదవ్ ప్రభుత్వం అద్వానీని అరెస్ట్ చేసింది.