Lok Sabha Election : మార్చి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..!

Byline :  Vinitha
Update: 2024-02-20 06:27 GMT

మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికల (Loksabha Elections) నగారా మోగనుంది. ఎలక్షన్స్ కు సంబంధించిన తేదిలపై కేంద్ర ఎన్నికల సంఘం(CEC) కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తోంది. పలు రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఈసీ షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్చి రెండో వారం తర్వాత ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఎలక్షన్స్ తేదీల కోసం మార్చి 8, 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానున్నట్లు సమాచారం. అంతేగాక జమ్మూకశ్మీర్‌లో భద్రతా ఏర్పాటు అక్కడి పరిస్థితులు, పోలీసు బలగాలపై అందులో చర్చించనున్నారు. ఆ తర్వాత మార్చి 12, 13 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లో పర్యటించి క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించనున్నారు. అన్ని చర్చల అనంతరం లోక్‌సభ, స్థానిక అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అంశాలపై ఒక అంచనాకు రానున్నట్లు సమాచారం. చర్చలు, సమావేశాలు పూర్తి అయిన తర్వాత మార్చి రెండోవారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

కాగా గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్‌ జరిగింది. మే 23న ఓట్ల లెక్కంపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. అయితే ఈసారి కూడా గతంలోలానే ఏప్రిల్‌-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్‌ ప్రకటించగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది.

Tags:    

Similar News