ఆ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ 200, మంచినూనె రూ.280

Update: 2023-06-05 02:14 GMT

మణిపూర్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సరుకుల కొరత కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పెట్రోల్ కోసం బంకుల వద్ద జనం కిలోమీటర్ల మేర బారులు తీరారు.

నిత్యావసరాలైన బియ్యం, టమాటా, ఆలుగడ్డ మొదలైనవాటి ధరల్ని రూ.30 నుంచి రూ.40 వరకు పెరగడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. గతంలో కిలో బియ్యం సగటు ధర రూ.30 నుంచి రూ.60కు చేరింది. కూరగాయల రేట్లపైనా ఆ ప్రభావం పడింది. గతంలో కిలో రూ.35 ఉన్న ఉల్లిగడ్డ ఇప్పుడు రూ.70, ఆలుగడ్డ ధర రూ.15 నుంచి రూ.40కు చేరింది. ఒక్కో గుడ్డు ధర రూ.10 పలుకుతోంది. రిఫైన్డ్ ఆయిల్ లీటర్ ధర రూ. 250 నుంచి 280 వరకు పెరిగింది.

మణిపూర్లో లీటర్ పెట్రోల్‌కు బ్లాక్ మార్కెట్‌లో రూ.200 పలుకుతోంది. హింసతో బాధపడుతున్న రాష్ట్రంలో సరుకుల కొరత ప్రజలను మరింత దెబ్బతీసింది. ఏటీఎంలలో నగదు అయిపోవడం, బ్యాంకులు మూతపడడం, ఇంటర్నెట్ లేకపోవడంతో కొనుగోలుదారులు నానా అవస్థలు పడుతున్నారు.

హైవే దిగ్బంధనం కారణంగా ఇంఫాల్ లోయలో పరిస్థితులు దారుణంగా మారాయి. నెల రోజులుగా కొనసాగుతున్న హింసాకాండలో ఇప్పటి వరకు 98 మంది చనిపోగా, 300 మందికిపైగా గాయపడ్డారు. హింసాత్మక ఘటనల కారణంగా ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన మణిపూర్‌లో ప్రజలు ఢిల్లీ, దిమాపూర్, గౌహతిల్లోని సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. 



Tags:    

Similar News