Ayodhya Temple : ఆ దేవుడే ఆయన్ని ఎంచుకున్నారు.. అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు

Byline :  Krishna
Update: 2024-01-13 01:28 GMT

అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కోసం యావత్ భారతావని ఎదురు చూస్తోంది. జనవరి 22న జరగనున్న ఈ మహోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు హాజరవుతున్నారు. అయోధ్య ఆలయ నిర్మాణం కోసం ఎంతో పోరాడిన అద్వానీ కూడా ఈ అద్భుత ఘట్టంలో పాల్గొంటారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో ఆలయం నిర్మాణం విధి నిర్ణయమని.. అందుకోసం శ్రీరాముడే మోదీని ఎంచుకున్నారని వ్యాఖ్యానించారు.

అయోధ్య ఉద్యమం తన రాజకీయ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన సంఘటన అని అద్వానీ అన్నారు. 1990లో రాముడి మీద నమ్మకంతో ప్రారంభించిన రథయాత్ర ఒక ఉద్యమంలా మారుతుందని తాము ఊహించలేదన్నారు. తాను కేవలం రథసారధిని మాత్రమే అని ఆ సమయం అనుకున్నట్లు చెప్పారు. రథయాత్రలో మోదీ తన వెంటే ఉన్నారని గుర్తుచేసుకున్నారు. అయితే ఈ వేళ మాజీ ప్రధాని వాజ్పేయి లేకపోవడం బాధ కలిగిస్తోందని అన్నారు. మోదీ ఆలయ ప్రతిష్ట చేసేటప్పుడు.. దేశంలోని ప్రతీ పౌరుడికి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు.


Tags:    

Similar News