మహువాకు మరో షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు..!

Byline :  Kiran
Update: 2023-12-12 08:23 GMT

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు మరో షాక్ తగిలింది. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలపై బహిష్కరణ వేటు పడిన ఆమెకు పార్లమెంటు హౌసింగ్ కమిటీ నోటీసులు పంపింది. తాజా పరిణామాల నేపత్యంలో ప్రభుత్వం గతంలో ఆమెకు కేటాయించిన ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయించాలని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖకు లేఖ రాసింది. మహువా 30 రోజుల్లోగా తన బంగ్లాను ఖాళీ చేసేలా ఆదేశించాలని కోరింది.

ఇదిలా ఉంటే బహిష్కరణపై మహువా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోక్‌సభ నుంచి బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. క్యాష్‌ ఫర్‌ క్వెరీ ఆరోపణలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ హమువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కించారు. అదానీ గ్రూప్‌ గురించి పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు ఆమె.. బిజినెస్ మేన్ దర్శన్‌ హీరానందానీ నుంచి డబ్బులు , విలువైన బహుమతులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే ఆరోపించారు. ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంలో అప్రూవర్‌గా మారిన హీరానందానీ.. ప్రశ్నలు అడిగేందుకు తాను మహువా మొయిత్రాకు డబ్బులు ఇచ్చానని స్పష్టం చేశారు. కృష్ణా నగర్‌ ఎంపీ అయిన మహువా మొయిత్రా పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీని లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీని దూషించి ఇబ్బంది పెట్టారని చెప్పారు. తాను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా పార్లమెంట్‌ లాగిన్‌ ఉపయోగించానని తేల్చి చెప్పారు. ఈ ఆరోపణలపై నవంబర్‌ 9న విచారణ జరిపిన లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ హీరానందానీ ఆరోపణలు నిజమేనని తేల్చింది. మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని ప్రతిపాదించింది. ఈ నివేదిక ఆధారంగా మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

Tags:    

Similar News