Mahua Moitra:ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీకి దీదీ కీలక బాధ్యతలు
ముడుపులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు(cash-for-query matter) అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న మహిళా ఎంపీ మహువా మొయిత్రాకు తృణమూల్ కాంగ్రెస్(TMC) కొత్త బాధ్యతలు అప్పగించింది. తన లోక్‌సభ నియోజకవర్గమైన కృష్ణానగర్ పరిధిలోని నదియా నార్త్ జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నియమించిందది. ఈ మేరకు సోమవారం తృణమూల్ కాంగ్రెస్ ప్రకటన చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో TMCని బలోపేతం చేసే బాధ్యత మహువాదిగా తెలిపింది అధిస్టానం.
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీని మహువా ఆశ్రయించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు పెను దుమారాన్ని రేపాయి. దీనిపై ఏర్పాటైన లోక్‌సభ ఎథిక్స్ కమిటీ మొయిత్రాను బహిష్కరించాలని సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ఆమెకు పార్టీ కొత్త బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరోవైపు, తనకు కొత్త బాధ్యతలు అప్పగించడం పట్ల మెహువా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తనను పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణానగర్ ప్రజల కోసం తాను ఎప్పుడూ పార్టీతో కలిసి పనిచేస్తానంటూ ట్వీట్ చేశారు.