పొరుగుదేశం పాకిస్తాన్కు మలేషియాలో ఘోర అవమానం జరిగింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్కు చెందిన బోయింగ్ కో. 777 విమానాన్ని కౌలలంపూర్ అధికారులు సీజ్ చేశారు. ఎయిర్ క్యాప్ లీజింగ్ కంపెనీకి బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఎయిర్ క్యాప్ కంపెనీకి దాదాపు 4 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 33 కోట్లు) బకాయి పడింది. ఆ మొత్తం చెల్లించాలంటూ కంపెనీ పలుమార్లు మెసేజ్ లు పంపినా పీఐఏ స్పందించలేదు. దీంతో ఎయిర్ క్యాప్ కోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన మలేషియా కోర్టు పాక్ కు చెందిన బోయింగ్ కో. 777 ఫ్లైట్ ను సీజ్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మంగళవారం సదరు ఫ్లైట్ కౌలలంపూర్ ఎయిర్ పోర్టులో ల్యాండైన వెంటనే అధికారులు విమానం సీజ్ చేశారు.
2021లో కౌలాలంపూర్ ఏవియేషన్ శాఖ బకాయిలు చెల్లించలేదన్న కారణంతో ఇదే విమానాన్ని మొదటిసారి సీజ్ చేసింది. బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో 173 మంది ప్రయాణికులతో ఉన్న ఈ విమానాన్ని కౌలాలంపూర్ ఏవియేషన్ అధికారులు తిరిగి పంపారు. తాజాగా పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించిన లీజింగ్ కంపెనీ మరోసారి సీజ్ ఆర్డర్స్ తెచ్చుకుంది. ఈ ఘటనపై స్పందించిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన అధికారి మలేషియా అధికారుల తీరును తప్పుబట్టారు. తాము బకాయిలు చెల్లించినా వారు ఫ్లైట్ ను సీజ్ చేశారని ఆరోపించడం విశేషం.