బ్రష్ చేసిన తర్వాత, నాలుక శుభ్రం చేసుకుంటూ ప్రమాదవశాత్తు టంగ్ క్లీనర్‌ను మింగేశాడు ఓ యువకుడు. అది కాస్త గొంతులో ఇరుక్కుపోవడంతో అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. మాట పడిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్.. గోండా జిల్లాలో ఈ విచిత్ర ఘటన జరిగింది. మోతీగంజ్ ప్రాంతంలోని కర్మాయిని గ్రామానికి చెందిన శివకాంత్ (25) రోజులాగే శుక్రవారం ఉదయం బ్రష్‌తో పళ్లను శుభ్రం చేసుకున్నాడు. ఆ తర్వాత టంగ్ క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకుంటున్న సమయంలో టంగ్ క్లీనర్‌ను మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో నానా ఇబ్బందులు పడ్డాడు. శ్వాస తీసుకోలేకపోయాడు. ఛాతిలో నొప్పి కూడా మొదలైంది. సరిగా మాట్లాడటం కూడా రాలేదు. అతడి పరిస్థితి చూసి భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే, గొంతులో ఇరుక్కు పోయిన టంగ్ క్లీనర్‌ను ఎలా బయటకు తీసుకురావాలో అక్కడున్న డాక్టర్‌కు అర్థం కాలేదు. అనంతరం బాధితుడిని గోండాలోని ఆర్ఎన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ ఆర్ఎన్ పాండే బాధితుడి శివకాంత్ ఎక్స్-రే తీయించారు. రిపోర్ట్ చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అనంతరం యువకుడికి ఆపరేషన్ చేసి గొంతు లోపల ఇరుక్కుపోయిన టంగ్ క్లీనర్‌ను బయటకు తీశారు. ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి శివకాంత్ ప్రాణాలను కాపాడినందుకు.. బాధితుడి కుటుంబ సభ్యులు డాక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై స్పందించిన డాక్టర్ ఆర్ఎన్ పాండే.. బాధితుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగుతోందని తెలిపారు.