మారణాయుధాలతో సీఎం నివాసంలోకి చొరబాటుకు యత్నం

Update: 2023-07-21 10:07 GMT

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం నివాసం సమీపంలోని లైన్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని కలకత్తా పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. కారులో వచ్చిన సదరు నిందితుడు అనుమానాస్పదంగా మమతా బెనర్జీ నివాసం సమీపంలోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో అడ్డుకున్న పోలీసులు అతడిని తనిఖీ చేశారు. అతని కారుపై పోలీస్ స్టిక్కర్ ఉండటాన్ని గమనించిన పోలీసులు అతన్ని ప్రశ్నించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఒక మారణాయుధం, కత్తి, నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వివిధ ఏజెన్సీలకు చెందిన పలు ఐడీ కార్డులు కూడా అతని వద్ద దొరికినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని షెక్ నూర్ అలామ్‌ అనే వ్యక్తిగా గుర్తించామని, ఎస్‌టీఎఫ్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు అతనిని తీసుకు వెళ్లి ప్రశ్నిస్తున్నారని కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ తెలిపారు.

ఘటన జరిగిన సమయంలో మమతా బెనర్జీ తన నివాసంలోనే ఉన్నారు. కోల్‌కతాలో ఏర్పాటు చేసిన అమరవీరుల దినోత్సవం ర్యాలీలో సీఎం పాల్గొనాల్సి ఉండగా, దీనికి కొద్ది గంటల ముందు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ‘ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకుని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అతడి వద్ద ఒక చాకుతోపాటు వివిధ ఆయుధాలు ఉన్నాయి. గంజాయి కూడా దొరికింది. బీఎస్‌ఎఫ్‌ తదితర ఏజెన్సీలకు సంబంధించిన అనేక గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయి. అతడు సీఎంను కలవాలనుకున్నాడు. ఇది చాలా తీవ్రమైన విషయం. అతడి ఉద్దేశం ఏంటో తెలుసుకునేందుకు యత్నిస్తున్నాం’ అని సీపీ వెల్లడించారు. అతడి వాహనాన్ని సీజ్‌ చేసినట్లు తెలిపారు. 

Tags:    

Similar News