భారత ప్రభుత్వం ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 దేశాల సదస్సును భగ్నం చేయడానికి ఓ ప్రబుద్ధుడు ప్రయత్నించి కటకటాల పాలయ్యాడు. సదస్సు జరుగుతున్న ప్రగతి మైదాన్ వైపు తుపాకులు, బాంబులతో నిండిన ఓ ఆటో రిక్షా వెళ్తోందని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన భాల్స్వా డెయిరీ స్టేషన్ పోలీసులు అతణ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేశారని, కేసు పెట్టి విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. నగరమంతటా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉందని, ప్రజలు పుకార్లు నమ్మొద్దని కోరారు. శుక్రవారం మొదలైన జీ 20 సదస్సులో అన్నీ షెడ్యూలు ప్రకారమే జరుగుతున్నాయి. మోదీ అధ్యక్ష దేశపు నేతలగా కీలక ప్రసంగం చేయనున్నారు.