మానవుడే దేవుడు.. రాముడి తత్వం ఇదే..

Byline :  Kiran
Update: 2024-01-20 09:12 GMT

భారతావని పవిత్ర రామనామ స్మరణతో పులకించిపోతోంది. ఆసేతుహిమాచలం అయోధ్య వైపు కదులుతోంది. ఈ నెల 22న అయోధ్యలో జరిగే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కోసం హిందువులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దేశ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం ఇది. హిందూధర్మంలో సువర్ణాక్షరాలతో లిఖితమవుతున్న అధ్యాయం ఇది. సాకేతపురిలో కొలువుదీరనున్న బాలరాముడిని ఒక్కసారైన చూసి రావాలని ప్రతి హిందువు హృదయం పరితపిస్తోంది!

హిందూమతంలో ముక్కోటి దేవతలు ఉన్నారు. వారిలో అగ్రగణ్యుడు ఎవరని ప్రశ్నించుకుంటే చాలా సమాధానాలు వస్తాయి. కొందరు రాముడంటారు. మరికొందరు శివుడు అంటారు. ఇంకొందరు దుర్గాదేవి, వినాయకుడు అంటారు. ఎవరు ఏ పేరు చెప్పినా అయోధ్య రాముడు అందరివాడు!

దశరథనందనుడు ఈ దేశ ధర్మానికి ప్రతీక.

కౌసల్యాసుతుడు ఈ దేశ కారుణ్యానికి సంకేతం.

సీతాపతి ఈ దేశ సహృదయతకు సంకేతం.

కోదండరాముడు ఈ దేశ శతకోటి హిందువుల ఆత్మ.

ఎప్పుడో వేల ఏళ్ల కిందట అయోధ్యలో జన్మించి ఓ రాకుమారుడు కోట్లాది హృదయాలను ఎలా గెలుచుకున్నాడు? భారతదేశమే కాదు, కంబోడియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల ప్రజలకు కూడా ఎందుకు ఆదర్శమూర్తి అయ్యాడు? కాలాలు మారినా, ధర్మాలు గాడి తప్పి తలకిందులైనా.. రామనామం ఇప్పటికీ ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో ఎందుకు మార్మోగుతోంది? ఈ ప్రశ్నలకు సమధానం ఒకే ఒక మాటలో చెప్పుకోవచ్చు. రాముడి సుగుణాలే అతణ్ని అందరివాడిని చేశాయి. రాముడు మహిమాన్వితుడైన దేవుడు. రాముడు అచ్చమైన మానవుడు. మనిషికి, దేవుడికి మధ్య భేదం లేదు. ప్రతి మనిషిలో దేవుడు కొలువై ఉంటాడు. మానవుడి అంతరాంతరాల్లో దాగిన ఆ దైవత్వాన్ని మేల్కొలే దివ్యమంత్రమే రామనామం. ఆత్మలో రామజ్యోతి వెలిగితే లోకాన్ని చుట్టుముట్టిన కటిక చీకటి చెదిరిపోతుంది.

మనిషిని సన్మార్గంలో మళ్లించే అద్భుత శక్తి రఘుపతిలో ఉంది. మనిషి హృదయం రామయ్యకు తెలిసినట్టు మరో దేవుడికి తెలియదంటే అతిశయోక్తి కాదు. మన నేలపై నడయాడిన రామచంద్రుడు మనిషి పడే కష్టాలన్నీ అనుభవించాడు. తండ్రి మాట జవదాటకండా అడవులకెళ్లాడు. పంచభక్ష్యపరమాన్నాలను కాదని కందమూలాలతో సరిపెట్టుకున్నాడు. పట్టుపీతాంబరాలను వదిలేసి నారవస్త్రాలు కట్టుకున్నాడు. భార్య దూరమైతే సామాన్యుడిలా విలపించాడు. భక్త శబరి ఇచ్చిన ఎంగిలిపళ్లను ఆరగించాడు. వాలిని దొంగచాటుగా చంపి దోషాన్ని మూటగట్టుకున్నాడు. రాతిని నాతిని చేసిన ఆ మహిమాన్వితుడు గంగాప్రవాహాన్ని దాటడానికి సామాన్యుడిగా గుహుడి పడవ ఎక్కాడు. తలచుకుంటే క్షణంలో లంకకు వెళ్లే శక్తి ఉన్నా.. మానవుడే మహనీయుడు అని వానరులతో వారధి నిర్మించాడు. అతిబలసంపన్నుడైన రావణుడితో హోరాహోరీ పోరాడాడు. జయించడం సాధ్యం కాక విభీషణుడు చెప్పిన కిటుకు ప్రయోగించి అనుకున్నది సాధించాడు. రావణుడి చెరలో ఉన్న సీతమ్మ శీలాన్ని ఎవరూ శంకించకుండా మనసు చంపుకుని అగ్నిపరీక్ష పెట్టాడు. అయోధ్యకు వచ్చాక లోకనిందకు భయపడి నిండుచూలాలైన జానకిని అడవులపాలు చేశాడు. కష్టసమయాల్లో మొక్కవోని ధైర్యం ప్రదర్శించిన రామయ్య గత్యంతరం లేని పరిస్థితిలో అతి సామాన్యుడిలా ప్రవర్తిస్తాడు. కన్నీళ్లు పెట్టాడు, లోకానికి భయపడ్డాడు. అయినా ధర్మం తప్పలేదు. లోకకల్యాణం కోసం తన సుఖాలను త్యాగం చేశాడు. ‘పరోపకారమిదం శరీరం’ ఇదే రాముడి ఆదర్శం. శిష్టరక్షణ దుష్టశిక్షణ అతని బాధ్యత. అందుకే భారతీయ సమాజానికి శ్రీరాముడు ఆదర్శమయ్యాడు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న దేశంలో కుటుంబం పట్ల, సమాజం పట్ల అత్యంత బాధ్యతతో మెలగిన జానకీ వల్లభుడికి అగ్రతాంబూలం దక్కడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.

రాముడి తత్వం మానవత్వమే. రాముడు పెద్దలపై చూపిన గౌరవం, వినయ విధేయతలు.. సోదరులపై చూపిన ప్రేమ, శరణార్థులకు చేసిన సాయం, జనరంజకంగా సాగించిన పరిపాలన ప్రతి మనిషికి, ప్రతి పాలకుడికి శిరోధార్యం. యుగయుగాలు వెలుగుతున్న ఆ అఖండ ఆదర్శజ్యోతి అసలు మర్మం తెలిస్తే లోకం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. స్వార్థం, వస్తు వ్యామోహం, అసహనం, విద్వేషాలు పెచ్చరిల్లుతున్న నేటి భారతదేశానికి కావాల్సింది అసలైన రాముడి ప్రేమ. హనుమంతుణ్ని అక్కున చేర్చుకున్న అపురూప స్నేహం. ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన అసలైన రాజరాజ్యం. రామచంద్రుడు ఓ మతానికి చెందిన దేవుడు కాడు. సకల మనవాళికి ఆదర్శప్రాయుడు. మనిషిలోని దైవత్వానికి మచ్చుతునక!

Tags:    

Similar News