కేంద్రమంత్రి ఇంట్లో హత్య.. ఎంపీ కొడుకుపైనే అనుమానం
కేంద్రమంత్రి కౌశల్ కిశోర్(Union Minister Kaushal Kishore) నివాసంలో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. కౌశల్ కిశోర్ కొడుకే ఆ యువకుడిని కాల్చి చంపినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యూపీ(Uttar Pradesh) రాజధాని లక్నోలోని దుబగ్గాలోని బెగారియా ప్రాంతంలో ఉన్న మంత్రి నివాసంలో ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు బీజేపీ కార్యకర్త వినయ్ శ్రీవాస్తవగా గుర్తించారు. వినయ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారీస్థాయిలో పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఓ పిస్టల్ స్వాధీనం చేసుకోగా.. ఆ పిస్టల్ ఎంపీ కౌశల్ కిషోర్ కుమారుడు వికాస్ కిషోర్‌కు చెందినదని తెలిసింది. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
అయితే ఘటన జరిగినప్పుడు ఎంపీ కుమారుడు ఢిల్లీలో ఉన్నారని అంటున్నారు. ఈ ఘటనపై ఎంపీ కౌశల్ కిషోర్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. హత్యకు ఆరుగురు కారణమని వినయ్ బంధువులు ఆరోపిస్తున్నారు. తన నివాసంలో కాల్చి చంపబడిన వ్యక్తిపై, బిజెపి ఎంపీ కౌశల్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ, “పోలీసులు స్వాధీనం చేసుకున్న పిస్టల్ నా కుమారుడు వికాస్ కిషోర్‌కు చెందినది, పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు, దోషులను వదిలిపెట్టరు. ఘటన జరిగినప్పుడు వికాస్ కిషోర్ నివాసంలో లేడు.. ఘటన జరిగినప్పుడు అతని స్నేహితులను, అక్కడున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.ఈ విషయం తెలుసుకున్న వికాస్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. , చనిపోయిన వినయ్ నా కొడుకుకు చాలా మంచి స్నేహితుడు" అని చెప్పారు.