Jharkhand: భర్తతో తెగదెంపులు.. కూతురికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన తండ్రి

Update: 2023-10-18 04:02 GMT

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని.. ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి బ్యాండ్-బాజా-బారాత్‌ అత్తారింటికి పంపే తల్లిదండ్రులను ఇప్పటికి వరకు చూసే ఉంటారు. కానీ పెళ్లయిన కూతురిని అదే ఆనందంతో శాశ్వతంగా అత్తారింటి నుంచి తిరిగి పుట్టింటికి తీసుకురావడం మీరు ఎప్పుడైనా చూశారా? అత్తింట్లో ఇబ్బందులు పడుతున్న కూతురికి విడాకులు ఇప్పించడమే మేలని.. మేళతాళాల నడుమ బాణసంచా కాల్చుతూ ఊరేగింపుగా ఆమెను పుట్టింటికి తీసుకొచ్చాడు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ నగరంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రాంచి నగరానికి చెందిన ప్రేమ్‌ గుప్తా.. 2022 ఏప్రిల్‌లో తన కుమార్తె సాక్షి గుప్తాను సచిన్‌ కుమార్‌ అనే వ్యక్తికి ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించాడు. పెళ్లైన కొన్నాళ్లకే భర్త తరఫు వారి నుంచి సాక్షికి వేధింపులు మొదలయ్యాయి. సచిన్‌కు అంతకు ముందే వేరో మహిళ అయిందన్న షాకింగ్ నిజం తెలిసినప్పటికీ తల్లిదండ్రుల సూచనతో సాక్షి గుప్తా అతడితో కాపురం చేస్తున్నది. ఎంత ఓపికతో ఉన్నా.. వేధింపులు మాత్రం తగ్గలేదు. ఇక సచిన్‌తో కలసి ఉండటం ఇంపాజిబుల్ అనుకున్న సాక్షి.. అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఆ నిర్ణయాన్ని సాక్షి తండ్రి రామ్ గుప్తా, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతించారు.

ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రులతో కూతురి మెట్టినింటికి వెళ్లిన రామ్ గుప్తా.. అక్కడి నుంచి మేళతాళాల నడుమ టపాసులు కాలుస్తూ సాక్షిని పుట్టింటికి తీసుకొచ్చారు. కుమార్తెలు ఎంతో విలువైన వారని, అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే పుట్టింటి వారు అండగా ఉండాలని, గౌరవంగా చూసుకోవాలని ప్రేమ్‌ గుప్తా సూచించారు. ఈ నెల 15న జరిగిన ఈ ఊరేగింపునకు సంబంధించిన వీడియోను ఆ తండ్రి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. మరోవైపు సచిన్‌తో విడాకుల కోసం న్యాయస్థానంలో కేసు వేశారు.

Full View

Tags:    

Similar News