'రాజీనామా చేసే ప్రసక్తే లేదు..' మణిపూర్ సీఎం బీరెన్ సింగ్

Update: 2023-07-26 05:44 GMT

మ‌ణిపూర్ హింసాకాండపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అయితే ఈ అంశంపై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ అంశంపై నోరు మెద‌ప‌క‌పోవ‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది. ఇప్పటి వరకూ ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై నోరు విప్పలేదు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బయటకు రావడంతో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ వస్తున్నాయి. మరోవైపు రాష్ట్రపతి పాలన విధించాలని, బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి

అయితే మ‌ణిపూర్‌లో ప్ర‌స్తుత ప‌రిస్ధితిపై సోమ‌వారం ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో .. ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగాలని బిజెపి తనను కోరవచ్చునని, మణిపూర్ ప్రజలు తనను ఎన్నుకున్నారని బీరెన్ సింగ్ అన్నారు. తాను రాజీనామా చేసే ప్రశ్నే లేదనీ, కానీ.. కేంద్ర నాయకత్వం, మణిపూర్ ప్రజలు కోరుకుంటే..తాను పదవిని వదిలివేస్తానని బీరెన్ సింగ్ అన్నారు. తాను ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కార్యకర్తను, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్నారు. కేంద్ర నాయకత్వం ఎప్పటికైనా ఆదేశిస్తుందనుకుంటే.. దానిని తాను తూచూ తప్పకుండా ఆచరిస్తానని అన్నారు. ప్రస్తుతం మణిపూర్‌లో శాంతిభద్రతలను కాపాడటం, వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించడమే తమ ప్రధాన లక్ష్యమనీ, ఇప్పటి వరకు ఎవరూ తనని రాజీనామా చేయమని అడగలేదని అన్నారు.

రాష్ట్రంలో అశాంతికి అక్రమ వలసదారులు, డ్రగ్ స్మగ్లర్లు కారణమని నిందించారు. అక్రమ వలసలను అరికట్టేందుకు శాయశక్తులా ప్రయత్నించామని, ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేశామని, మణిపూర్‌లో కుకీలు, మెయితీలు సహా 34 తెగలు ఉన్నాయని, ఇప్పటికే ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఐక్యంగా ఉన్నారని, కానీ, కొందరు ర్యాలీ పేరుతో రాష్ట్రాన్ని తగులబెట్టారని ఆయన అన్నారు. మే 3న జరిగిన ఆదివాసీ ర్యాలీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఆగ్రహించారు. మణిపూర్‌లో పరిస్థితిని ఎలా పరిష్కరించాలో, శాంతిభద్రతలను పునరుద్ధరించాలని తాము కట్టుదిట్టమైన ప్రణాళికలను రూపొందించామనీ, త్వరలోనే మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలపై నమోదైన అత్యాచారాలు, హత్యల గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,068 ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా.. ఇప్పటి వరకూ ఒక అత్యాచార సంఘటన మాత్రమే నమోదైందని అన్నారు. గత వారం కార్ సర్వీస్ సెంటర్‌లో హత్యకు గురైన ఇద్దరు మహిళలపై అత్యాచారం జరగలేదని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News