మణిపూర్ లో మరోసారి అల్లరిమూకలు రెచ్చిపోయాయి. మూడు నెలలు కింద మొదలైన అల్లర్లు ఇంకా జరుగూతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అల్లమూకలు మరోసారి పోలీసు ఆయుధాగారం మీద దాడి చేసి భారీ సంఖ్యలో ఆయుధాలను ఎత్తుకెళ్ళారు. బిష్ణూపూర్ జిల్లా నారన్ సైనాలో ఉన్న 2వ ఇండియా రిజర్వ్ బెటాలియన్ ప్రధాన కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నారన్ సైనాలో ఉన్న బెటాలియన్ కేంద్రం మీద దాడి చేసిన అల్లరిమూక అక్కడ ఉన్న అత్యాధునిక ఆయుధాలను లూటీ చేసింది. ఏకే రైఫిళ్ళు, మూడు ఘటక్ రైఫిళ్ళు, 195 సెల్ఫ్ లోడింగ్ రైఫిళ్ళు, ఐదు ఎంపీ-5 గన్ లు, 16.9 ఎంఎం పిస్టళ్ళు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో పాటూ కార్బైన్ హ్యాండ్ గ్రనైడ్లతో పాటూ 19వేల బుల్లెట్లను ఎత్తుకెళ్ళారని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు ఇంఫాల్ లో కూడా ఇలాగే దాడికి ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పారు.
వరుసగా ఆయుధాల లూటీ జరుగుతూనే ఉంది. వేల సంఖ్యలో ఆయుధాలను నిరసకారులు దోచుకున్నారు. 37 ప్రాంతాల్లో సుమారు 5వేల ఆయుధాలు తీసుకెళ్ళినట్లు సమాచారం. మరోవైపు అల్లర్లలో చనిపోయిన వారి మృతదేహాలకు ఐటీఎల్ఎఫ్ తలపెట్టిన అంత్యక్రియలు కూడా ఉద్రిక్తతలకు దారి తీసింది. నిషేధ ఉత్తర్వులను లెక్క చేయకుండా గిరిజనులు ప్రదర్శనగా వెళుతుండగా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. పోలీసులు వారి మీద బాష్ప వాయువులు ప్రయోగించారు. ఇందులో పదుల సంఖ్యలో గాయపడ్డారు.