మణిపూర్​ గవర్నర్​ను కలిసిన 'ఇండియా' ఎంపీలు.. మెమోరాండం అందజేత

Update: 2023-07-30 07:39 GMT

మణిపూర్​ హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఆ ఘటనల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో బాధితులను పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయడానికి 21 మంది ఎంపీలతో కూడిన ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రతినిధి బృందం శనివారం మణిపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు.. బిష్ణుపుర్​, చురాచంద్​పుర్​ జిల్లాల్లోని ఇంఫాల్​, మోయిరాంగ్​లో ఉన్న అనేక శిబిరాలను సందర్శించి.. బాధితులను కలుసుకున్నారు. అనంతరం ఆదివారం ఉదయం మణిపుర్​ గవర్నర్ అనసూయ ఉయికేను రాజ్​భవన్​లో కలిశారు. తమ పరిశీలనల మీద వినతి పత్రం సమర్పించారు. తెగల మధ్య ఘర్షణలతో సాధారణ జన జీవనం అస్తవ్యస్తంగా మారిన మణిపూర్‌లో సాధారణ స్థితిని సత్వరమే పునరుద్ధరించాలని గవర్నర్ ను కోరారు. మణిపుర్‌లో శాంతి పునరుద్ధరించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తాము చెప్పిన మాటలతో ఆమె ఏకీభవించారని ఎంపీలు మీడియాకు తెలిపారు.





 


కాంగ్రెస్ సీనియర్​ నేత అధీర్​ రంజన్ చౌదరి గవర్నర్ ను కలిసిన తర్వాత.. మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన 21 మంది ఎంపీలు సంయుక్తంగా గవర్నర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చినట్లు తెలిపారు. మణిపూర్ లో తమ రెండ్రోజుల పర్యటన వివరాలను గవర్నర్ వద్ద ప్రస్తావించామని తెలిపారు. తాము చెప్పిన మాటలతో గవర్నర్ ఏకీభవించారని తెలిపారు. అన్ని తెగలవారితోనూ సమావేశాలను ఏర్పాటు చేసి, సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని ఆమె చెప్పారన్నారు. గవర్నర్ స్పందిస్తూ, రాష్ట్రంలోని పరిస్థితులపై తన బాధను, ఆవేదనను వ్యక్తం చేశారన్నారు. అధికార, ప్రతిపక్షాలు కలిసి రాష్ట్రానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపించాలని సలహా ఇచ్చారని చెప్పారు. ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని పారదోలడానికి, సమస్యను పరిష్కరించడానికి అన్ని తెగల ప్రతినిధులతోనూ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారన్నారు. మణిపుర్​ వివాదాన్ని సత్వరమే పరిష్కరించకుంటే.. దేశంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు అధీర్​ రంజన్ చౌదరి.

మణిపుర్‌లో శాంతి నెలకొల్పేందుకు అధికారులు దిద్దిబాటు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మయన్మార్‌ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించిన వారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం మణిపుర్‌ ప్రజల నుంచి బయోమెట్రిక్‌ డేటాను సేకరిస్తున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది






 


Tags:    

Similar News