మణిపూర్ అల్లర్లు.. కేంద్ర మంత్రి ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు

Update: 2023-06-16 04:09 GMT

షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలనే డిమాండ్ పై మణిపూర్ లో కొంత కాలంగా రెండు వార్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడం తీవ్ర కలకలం రేపింది. ఘటన సమయంలో కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. ఇంఫాల్ లోని కోంగ్బా లోని మంత్రి ఇంటికి చేరుకున్న ఆందోళనకారులు ఒక్క సారిగా మంత్రి ఇంటికి నిప్పు అంటించారు. ఘటనా సమయంలో 9 మంది ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డ్స్, 8మంది అదనపు భద్రతా సిబ్బంది ఉన్నారు. నిరసనకారులు పెట్రోల్ బాంబులతో దాడులకు పాల్పడినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. నిరసన కారులను తాము అదుపు చేయలేకపోయినట్లు వారు తెలిపారు. అన్ని వైపుల నుంచి మంత్రి ఇంటి వైపునకు పెట్రోల్ బాంబులను విసిరినట్లు తెలిపారు.

మరోవైపు ఈ అల్లర్లపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పలు స్థాయిల్లో చర్చలు జరుపుతోందని అన్నారు. హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గవర్నర్ శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేశారని, శాంతి కమిటీ సభ్యులతో సంప్రదింపులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో సాధ్యమైనంత త్వరగా శాంతిని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పడం అంత సులభం కాదని, కానీ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని ఆయన అన్నారు. కాగా.. ఈ వారం ప్రారంభంలో రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నెమ్చా కిప్జెన్ ఇంటిని కూడా దుండగులు తగలబెట్టిన సంగతి తెలిసిందే.  

Tags:    

Similar News