పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా నలుగురు ఉగ్రవాదులు భారత్లో చొరబడేందుకు యత్నించి.. భద్రతాబలగాల కాల్పుల్లో హతమయ్యారు. జమ్మూ కశ్మీర్ కుప్వారాలోని మచల్ సెక్టార్లో పోలీసులు, ఆర్మీ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్లో నియంత్రణ రేఖ గుండా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది గుర్తించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. కాగా, జూన్ 16న కుప్వారా జిల్లాలోని జుమాగుండ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమయ్యారు.