ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రైలు ప్రమాదాలు ఆగడం లేదు. కొన్ని పట్టాలు తప్పుతుంటే, కొన్ని మంటల్లో మాడి మసి అవుతూ వందలాది కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. బుధవారం ఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ రైలు New Delhi-Darbhanga Express train (02570)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దేశ రాజధాని నుంచి బిహార్‌లోని దర్భంగా వైపు వెళ్తున్న రైలు యూపీలోని ఇటావా దగ్గర్లో సరాయ్ భూపట్ స్టేషన్ దాటుతుండగా పలు బోగీల్లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బోగీల్లో నుంచి కిందికి దూకేశారు. పలువురికి గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిని ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. రైల్వే పోలీసులు ప్రయాణికులను అప్రమత్తం చేసి అందర్నీ రైలు నుంచి దించేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు బోగీల్లో మంటలు చెలరేగాయని సీనియర్ ఎస్పీ సంజయ్ కుమార్ వర్మ తెలిపారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. రైల్లో ప్రయాణికులు పరిమితికి మించి ప్రయాణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.