రాష్ట్రపతి పాలన పెట్టిస్తా.. సీఎంకు గవర్నర్ వార్నింగ్..
పంజాబ్ లో గవర్నర్, సీఎం మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వంపై గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను పంపిన లేఖలకు ప్రభుత్వం నుంచి సమాధానం ఇవ్వడంలేదని మండిపడ్డారు. పంజాబ్ లో రాష్ట్రపతి పాలన పెట్టమని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు గవర్నర్ ముఖ్యమంత్రి మాన్ కు లేఖ రాయడం విశేషం.
భగవంత్ మాన్ కు రాసిన లేఖలో గవర్నర్ భన్వరిలాల్ తీవ్రంగా హెచ్చరించారు. తాను పంపే లేఖలకు సమాధానం ఇవ్వనిపక్షంలో ఐపీసీ సెక్షన్ 124 కింద క్రిమినల్ చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందంటూ రాష్ట్రపతికి నివేదిక పంపుతానని చెప్పారు.
రాష్ట్రంలోని 36 స్కూళ్లకు చెందిన ప్రిన్సిపాల్స్ ను ట్రైనింగ్ కోసం విదేశాలకు పంపడంపై సమాచారం ఇవ్వాలంటూ గవర్నర్ భగవంత్ మాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో పాటు పలు సందర్భాల్లో వివిధ అంశాలపై సమాచారం కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వడంలేదన్నట్లు కనిపిస్తోందని భన్వరిలాల్ అభిప్రాయపడ్డారు.
గవర్నర్ పురోహిత్ వార్నింగ్ పై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. పంజాబ్‌కు బదులు మణిపూర్, హర్యానా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తే బాగుంటుందని సూచించింది. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.