ఓవైపు తుఫాన్.. మరోవైపు భూకంపం.. భయాందోళనలో ప్రజలు

Update: 2023-06-15 07:12 GMT

ఓ వైపు బిపర్‌జోయ్‌ తుపానుతో గుజరాత్ ప్రజలు వణుకుతుండగా.. మరోవైపు భూకంపం వారిని మరింత భయపెట్టింది. కచ్ జిల్లాలో బుధవారం సాయంత్రం భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా వణికిపోయారు. 3.5 తీవ్రతతో భూకంపం సంభవించగా.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.

మరోవైపు బిపర్జోయ్ తుపాన్ అత్యంత భయానకంగా మారనుంది. తుఫాన్ ప్రభావంతో గుజరాత్‌‎లోని తీర తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. భారీ వర్షాలతో జనం తల్లడిల్లుతున్నారు. తుపాను ప్రభావం అధికంగా ఉండటంతో ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు పలు ప్రాంతాల్లోని 74వేల మందికిపైగా స్థానికులను సురక్షిత స్థావరాలకు తరలించారు. కఛ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్‌లో కుంబవృష్టిగా వర్షాలు ముంచెత్తుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పలు ప్రాంతాల్లో హైఅలర్ట్‎ను ప్రకటించింది.

గడిచిన 24 గంటల్లో దేవభూమి ద్వారక, జామ్‌నగర్, జునాగఢ్, పోరుబందర్, రాజ్‌కోట్‌ జిల్లాల్లో 50 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల ఏకంగా 121 మి.మీ.ల వర్షం కురిసింది. అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తుపాన్ దిశను మార్చుకుని ఈశాన్యవైపుగా కదులుతూ కఛ్, సౌరాష్ట్రల మధ్య జఖౌ పోర్ట్‌ సమీపంలో ఇవాళ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సమయంలో తుపాను అత్యంత బీభత్సాన్ని సృష్టించనుందని హెచ్చరించింది.


Tags:    

Similar News