బ్రిజ్ భూషణ్పై చర్యలు ఎందుకు తీసుకుంటలేరు - ఎమ్మెల్సీ కవిత

Update: 2023-05-31 10:51 GMT

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీలో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై రెజ్లర్లు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం నిలదీశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రెజ్లర్లు లేవనెత్తుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన పరిష్కారం చూపాలని కవిత డిమాండ్‌ చేశారు. దేశానికి బంగారు పతకాలు సాధించిన క్రీడాకారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం తగదన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రపంచమంతా చూస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ ప్రజలు సమాధానం కోరుకుంటున్నారని కవిత అన్నారు.

మహిళా రెజ్లర్ల కృషి, అంకితభావం, దేశభక్తి, రెజ్లింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిందని కవిత అభిప్రాయపడ్డారు. పోక్సో వంటి తీవ్రమైన అభియోగం తర్వాత కూడా నిందితుడు బహిరంగంగా బయట తిరుగుతున్నాడని అన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్న కవిత.. దేశానికి బంగారు పతకాలు సాధించిన క్రీడాకారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. రెజ్లర్ల డిమాండ్ పై దేశం మొత్తం సమాధానం కోరుకుంటోందని.. ప్రపంచం చూస్తోందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించుకోవాలని అన్నారు. మోడీ సర్కారు ఇప్పటికైనా కళ్లు తెరిచి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

బ్రిజ్ భూషణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ సమయంలో వారు మార్చ్ నిర్వహించడం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో మంగళవారం గంగా నదిలో తమ పతకాలు కలిపేస్తామని వారు హెచ్చరించారు. అయితే రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ మధ్యవర్తిత్వంతో వెనక్కు తగ్గారు. ఐదు రోజుల్లోగా బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు రెజ్లర్లకు మద్దతుగా జూన్‌ 1వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది.


mlc kavitha demands actions against wfi chief brijbhushan singh


Tags:    

Similar News