మణిపూర్‌లోని ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నేట్ సేవలను తిరిగి ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మణిపూర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని నవంబర్ 13వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల జరిగిన కాల్పుల్లో 10 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
బిష్ణూపూర్, ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాంగ్‌పోక్పి జిల్లాలో రెండు కమ్యూనిటీల మధ్య కాల్పులు జరుగుతున్నాయని మణిపూర్ డీజీపీ వెల్లడించారు. మరో ఇద్దరు వ్యక్తులు అదృశమయ్యారని, నలుగురు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు అపహరించారని తెలిపారు. దీంతో అక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించే చిత్రాలు, ద్వేషపూరిత ప్రసంగాలు, వీడియోలను వ్యతిరేక వ్యక్తులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం ఉందని, దాంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, అందుకే మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేధం పొడిగించినట్లు పేర్కొన్నారు.