5 రాష్ట్రాల ఎన్నికల ముందు మోడీ సర్కారు సంచలన నిర్ణయం
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాలసీ అమలుచేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్రం సెప్టెంబర్లో పార్లమెంట్ స్పెషల్ సెషన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
జమిలి ఎన్నికల బిల్లు
నిజానికి సెప్టెంబర్ 18 నుంచి 22 తేదీ వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం కీలక బిల్లులేవీ ప్రవేశపెట్టదంటూ వార్తలు వచ్చాయి. అయితే మోడీ సర్కారు మాత్రం జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకే స్పెషల్ సెషన్ ఏర్పాటుచేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక దేశం ఒక ఎన్నిక విధానం ద్వారా లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
లా కమిషన్ కసరత్తు
వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు సంబంధించి లా కమిషన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది జూన్ నుంచి చర్చలు ప్రారంభించింది. ప్రజలతో పాటు మతపరమైన సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు సాధారణంగా వాటి గడువు ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే.. వన్ నేషన్, వన్ ఎలక్షన్ పాలసీలో భాగంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుపుతారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ పాలసీ అమలు చేసేందుకు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి పెంచడం, మరికొన్ని అసెంబ్లీల కాలపరిమితి తగ్గించడం చేస్తారు. మోడీ సర్కారు ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 వంతు మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.
ఐదు రాష్ట్రాలతో పాటు
ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలకు జరగనున్న నేపథ్యంలో కేంద్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు తీసుకురావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఏడాది తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది మేలోపు సార్వత్రిక ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం ఈ 5 రాష్ట్రాలతో పాటే లోక్సభ, మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరపడం లేదా ఆ 5 రాష్ట్రాల ఎన్నికలను ఏప్రిల్ - మే వరకు వాయిదా వేసే అవకాశముందని సమాచారం.