విపక్షాలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీవ్ర వాదోపదాలకు దారితీసింది. గురువారం మూడో రోజు చర్చ తర్వాత తీర్మానం మూజువాణీ ఓటింగ్‌లో వీగిపోయింది. సభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉండడంతో విపక్షాల అపనమ్మకం ఊహించినట్లే నెగ్గలేకపోయింది. చర్చ సందర్భగా ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌ను నాశనం చేసింది కాంగ్రెసేనని మండిపడ్డారు. ‘‘నో కాన్ఫిడెన్స్ తీర్మానం నో బాల్, నో బాల్‌గానే సాగింది’’ అని చురక అంటించారు. ‘‘ప్రభుత్వంపై మాటిమాటికి అవిశ్వాసం తీసుకొస్తూ మీకు మీరే పరువు పోగొట్టుకుంటున్నారు. మీ దరిద్రమేమిటో అర్థం కావడం లేదు. మాపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోంది’’ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పాత అవిశ్వాసాలను కూడా ఆయన ప్రస్తావించారు. 1999లో శరద్ పవార్, 2003, 2018లో సోనియా గాంధీ తమపై అవిశ్వాసాలు పెట్టి అభాసుపాలయ్యారని అన్నారు. ‘‘మీకు నమ్మకలేకపోయినా ప్రజలు మమ్మల్ని విశస్తిస్తున్నారు. మేం అన్ని రికార్డులు బద్దలుకొట్టి మళ్లీ అధికారంలోకి వస్తాం. 21వ శతాబ్దం భారత్‌దే. అభివృద్ధి మన మంత్రం కావాలి. విభేదాలు, వైరుధ్యాలు దాటి ఏకతాటిపైకి రావాలి. మీరు చెప్పేవన్నీ బద్ధాలు. గత తొమ్మిదేళ్లలో ఒక్క కుంభకోణమన్నా జరిగిందా? 37 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని ఐఎంఎఫ్ చెబుతోంది. మన అభివృద్ధిని ప్రపంచమంతా చూస్తోంది. మీకు మాత్రం కనిపించడం లేదు. మూడు రోజుల చర్చలో8 మీ అక్కసంతా కక్కేశారు. మీ మనసులు తేలికపడ్డాయి. మోదీకి గోరీ కడుతున్నాం అనుకున్నారు. కానీ మాకే లాభం జరుగుతోంది’’ అని అన్నారు. ప్రధాని ఒకపక్క మాట్లాడుతుండగానే విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.