మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని మోదీ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మన్మోహన్ సింగ్ చక్రాల కుర్చీలో ఉన్నా దేశం కోసం పనిచేశారని కొనియాడారు. ఆయన ఎంపీలందరికీ ఆదర్శమని తెలిపారు. రాజ్యసభ (Rajya Sabha)లో 56 మంది ఎంపీలు త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వారికి సభలో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ..కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ని ప్రశంసించారు.
దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవ అపారమన్నారు. చాలా కాలం పాటు రాజ్యసభకు ఆయన అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. రాజ్యసభలో ఇటీవల ఓ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినప్పటికీ...ఆయన వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటు వేశారని గుర్తు చేశారు. ఒక సభ్యుడిగా తన విధుల విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నారనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో ఉన్నా పనిచేశారని కొనియాడారు. అంతేగాక ఎంపీలందరికీ ఆయన ఆదర్శమన్నారు ప్రధాని మోదీ.