ఘోర రోడ్డు ప్రమాదాలు.. పదులు సంఖ్యలో మృతులు

Update: 2023-07-11 05:58 GMT

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి వాటి కారణంగా ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో నరకవేదన అనుభవిస్తున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో ఘోర ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య పదుల్లో ఉంది. సోమవారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర ప్రమాదం 9 మంది ప్రాణాలను బలితీసుకుంది. గ్యాస్ ట్యాంకర్ ఆటో-రిక్షాను ఢీకొని బోల్తా పడిన ఘటనలో ఒక చిన్నారితో సహా 9 మంది మృతి చెందారు. అలాగే మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న సీఎం ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే మృతి చెందిన వారికి ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50,000 ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

సోమవారం అర్ధరాత్రి దాటాక ఏపీలోని ప్రకాశం జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు... అదుపు తప్పి సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. దర్శి సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. సీఎం జగన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇక ఈ రోజు(మంగళవారం) ఉదయం యూపీలోని ఘజియాబాద్‌ ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ప్రమాదంలో 6 గురు మరణించారు. స్కూల్ బస్సు వేగంగా వచ్చి కారును ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన 8 ఏళ్ల చిన్నారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న ఘజియాబాద్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 




Tags:    

Similar News