కైలాసానికి ఇక మనదేశం నుంచే వెళ్లొచ్చు.. కేంద్రం

Update: 2023-07-21 06:25 GMT

భారతీయ హిందువులు, బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావించే కైలాస పర్వత దర్శనానికి చిక్కులు తొలగిపోనున్నాయి. పరమశివుడు కొలువై ఉన్నట్టు భావించే ఈ హిమనగాన్ని అతి త్వరలోనే చైనా, నేపాల్‌లకు వెళ్లకుండా మన దేశం నుంచే దర్శించుకోవచ్చు. అక్కడికి వెళ్లడానికి భారత ప్రభుత్వం చేపట్టిన కీలక ప్రాజెక్టు శరవేగంగా పూర్తవవుతోంది. అన్నీ అనుకున్నట్లు పూర్తయితే ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నుంచే దర్శనం మొదలవుతుంది.




 


ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లా నాబిదంగ్ కీఎవీన్ హట్స్ నుంచి హిమాలయాల్లోని లిపులేఖ్ శిఖర కనుమ వరకు భారత బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్‌(బీఆర్వో) రోడ్డు నిర్మిస్తోంది. లిపులేఖ్ కనుమ నుంచి కైలాస శిఖరం చాలా దగ్గరగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆరున్న‌ర కిలోమీట‌ర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయని, రోడ్ కటింగ్ పూర్తయ్యాక కైలాస్ వ్యూవ్ పాయింట్‌కు రోడ్డు పూర్తవుతుందని బీఆర్వో డైమెండ్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ విమ‌ల్ గోస్వామి తెలిపారు. వర్షాల వల్ల పెద్దగా ఇబ్బంది లేకపోతే సెప్టెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. కోవిడ్ వల్ల 2019 నుంచి కైలాస మానససరోవర యాత్ర వాయిదా పడుతోంది. అంతకుముందు కూడా చైనా కొర్రీల వల్ల తరచూ ఆటంకాలు కలిగేవి. మనదేశం నుంచి కైలాసాన్ని చూడడాటానికి వ్యూపాయింట్ వరకు దారి నిర్మితమైతే భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని పర్యాటకం మరింత పెరిగే అవకాశముంది. టిబెట్‌ ముఖద్వారంగా చెప్పే లిపులేఖ్ సముద్ర మట్టానికి 17500 అడుగుల ఎత్తులో ఉంది. ఈ లిపులేఖ్ నుంచి కైలాస పర్వతాన్ని స్పష్టంగా చూడొచ్చు.

ప్రస్తుతం భారత్ నుంచి కైలాస శిఖరానికి వెళ్లడానికి మూడు మార్గాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ నుంచి ట్రెక్కింగ్ ద్వారా లిపులేఖ్ వరకు వెళ్లొచ్చు. ఆరోగ్యం దృఢంగా ఉన్నవారినే ఈ యాత్రకు అనుమతిస్తారు. నడవలేని వారు చైనా, నేపాల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. పశ్చిమబెంగాల్‌లోని బాగ్దోగ్రా నుంచి సిక్కింలోని నాథూలా పాస్‌ గుండా రోడ్డుమార్గంలో 1,665 కిలోమీటర్లు ప్రయాణాలి. అందులో 1,490 కిలోమీటర్ల దూరం చైనాదే. నేపాల్ రాజధాని కాఠ్మండూ నుంచి 840 కిలోమీటర్లు ప్రయాణించాలి. 


Tags:    

Similar News