టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలపై పార్లమెంటు ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది. లోక్‌సభ నుంచి మహువాను బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ 500 పేజీల నివేదికలో సిఫార్సు చేసింది. దీనిపై సభలో చర్చించిన తర్వాత ఓటింగ్ నిర్వహించారు. ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని సభ అంగీకరించింది. అందుకే ఆమె ఎంపీగా కొనసాగడం తగదనిని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
మహువాపై వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆమెను సభ నుంచి బహిష్కరించాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తీర్మానాన్ని పెట్టారు. అయితే, ఈ తీర్మానాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయమివ్వాలని, నివేదికపై ఓటింగ్‌కు ముందు సభలో చర్చ జరపాలని టీఎంసీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు.
ఎంపీల డిమాండ్ నేపథ్యంలో నివేదికపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతిచ్చారు. ఈ క్రమంలోనే అధికార, విపక్షాల ఎంపీల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని మహువా కోరగా.. స్పీకర్ అందుకు నిరాకరించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఓటింగ్ సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతరం మూజువాణీ ఓటింగ్ ద్వారా ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్‌సభ ఆమోదించింది. అనంతరం మహువాను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్.. సభను సోమవారానికి వాయిదా వేశారు.