దేశంపై ఎంపీ రాజా షాకింగ్ కామెంట్స్ ..అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్
దేశంపై డీఎంకే ఎంపీ ఎ. రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఒక దేశం కాదు. దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక దేశం అంటే ఒక భాష, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి ఉండాలి. అప్పుడు మాత్రమే అది ఒక దేశంగా పరిగణిస్తారు. భారతదేశం ఒక ఉపఖండం. కారణం ఏమిటంటే ఇక్కడ తమిళం ఒక దేశం, మలయాళం ఒక దేశం. ఇలా దేశాలన్నీ కలిసి భారతదేశాన్ని ఏర్పరుస్తాయి. సంస్కృతులు కూడా వేరుగా ఉన్నాయి’ అని రాజా అన్నారు. భిన్న భాషలు, విభిన్న సంస్కృతులు కలిగిన రాష్ట్రాలు దేశంగా ఏర్పడ్డాయన్నారు. అందుకే ఇది దేశం కాదని... ఉపఖండం అని... ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందన్నారు. తనకు రాముడి పైనా... రామాయణం పైన విశ్వాసం లేదని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేం రాముడికి శత్రువులం. నాకు రామాయణంపైన, రాముడిపైన విశ్వాసం లేదు’ అని రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాజా చేసిన ఈ వ్యాఖ్యలపైన అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయ ప్రధాన పూజారి మండిపడ్డారు. దీనిపైన ప్రధానికి, రాష్ట్రపతికి లేఖ రాస్తామని చెప్పారు. భారతదేశ ధర్మాన్ని అవమానించడం, హిందూ దేవుళ్లను బహిరంగంగా కించపరచడం వంటివి క్షమించరానివని, ఈ వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించరని, వెంటనే ఎ రాజాను అరెస్టు చేయాలని తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాజా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. డీఎంకే నేతల నుంచి ఇలాంటి విద్వేష ప్రసంగాలు చూస్తూనే ఉన్నామని ధ్వజమెత్తింది. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ మరవకముందే రాజా ఇలా మాట్లాడటం దారుణమని పేర్కొంది. రాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు స్పందించాలని డిమాండ్ చేసింది. డీఎంకే నేతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. రాజా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కాంగ్రెస్ కూడా స్పందించింది. ఆ వ్యాఖ్యలతో తాము వంద శాతం ఏకీభవించడం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ అన్నారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలన్నారు.