ఇండియా పేరు భారత్గా మార్చాలని తీర్మానం.. సభ నుంచి బీజేపీ వాకౌట్..

By :  Kiran
Update: 2023-09-12 16:43 GMT

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ స్పెషల్ సెషన్లో మోడీ సర్కారు ఇండియా పేరును భారత్ గా మార్చనుందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. జమిలి ఎన్నికల బిల్లు, పేరు మార్పు కోసమే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ అంశంపై అధికార, విపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఇండియా పేరును భారత్గా మార్చాలంటున్న బీజేపీ గతంలో ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించి సభ నుంచి వాకౌట్ చేసింది.

2004లో ఉత్తర్ ప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇండియా పేరు భారత్ గా మార్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్న తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనికి ఒక్క బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ ఓకే చెప్పాయి. అయితే కమలదళం మాత్రం తీర్మానంపై చర్చ సమయంలో సభ నుంచి వాకౌట్ చేసింది. దేశంపై బ్రిటిషర్ల ముద్ర చెరిపేయడం, రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాల మేరకు ఇంగ్లీష్కు అంత ప్రాధాన్యం ఇవ్వొద్దన్న లక్ష్యంతో ములాయం దేశం పేరును భారత్ గా మార్చాలని తీర్మానం చేశారు. ఇంగ్లీష్ భాష వ్యక్తుల మధ్య అంతరాలకు పెంచుతోందని అందుకే దాని స్థానంలో హిందీని అధికారిక భాషగా మార్చాలన్నది లోహియా అభిప్రాయం. 200 ఏండ్లు పాలించిన బ్రిటిషర్లు దేశం పేరును ఇండియాగా మార్చారని అంతకు ముందు భారత్ అని పిలిచేవారని అందుకే మళ్లీ పేరు మార్చాలని అప్పట్లో సమాజ్ వాదీ పార్టీ తన మేనిఫెస్టోలో సైతం ఈ అంశాన్ని చేర్చింది.

2004లో దేశం పేరు మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకించిన బీజేపీ తాజాగా ఇప్పుడు ఆ అంశాన్ని తెరపైకి తేవడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. ప్రతిపక్ష కూటమి పేరు ఇండియా అని పెట్టుకున్నందుకే మోడీ సర్కారు ఇండియాను భారత్గా మార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేంద్ర నిజంగా పేరు మార్పు చేయాలని నిర్ణయించిందా లేదా తెలియాలంటే సెప్టెంబర్ 18 వరకు వేచి చూడాల్సిందే.




Tags:    

Similar News