Nanded Hospital: మహారాష్ట్ర నాందేడ్ ఆసుపత్రిలో మరో ఏడుగురు మృతి..

Update: 2023-10-03 07:08 GMT

మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణ మృదంగం మోగుతోంది. సోమవారం ఆసుపత్రిలో 24 గంటల వ్యవధిలో 24 మరణాలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే అర్ధరాత్రి వేళ మరో ఏడుగురు కూడా మృతిచెందారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. దీంతో నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో.. గత 48 గంటల్లో మరణించిన వారి సంఖ్య 31కి చేరుకుంది. ఈ 31 మందిలో.. 16 మంది శిశువులు ఉన్నారు. ఈ మరణాలపై విచారణ జరిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. మంగళవారం మధ్యాహ్నానికి ఈ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ అంశంపై విపక్షాలు మహారాష్ట్ర సర్కారు తీరును తప్పుపట్టాయి. మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

అయితే ఈ ఘటనకు సంబంధించి వైద్యుల నిర్లక్ష్యం ఆరోపణలను ఆసుపత్రి డీన్ డాక్టర్ శ్యామ్‌రావ్ వాకోడ్ తోసిపుచ్చారు. మందులు లేదా వైద్యుల కొరత కూడా లేదని.. సరైన సంరక్షణ అందించినప్పటికీ రోగులకు చికిత్సకు స్పందించడం లేదని ఆయన తెలిపారు. చాలా మంది రోగులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారని, దీనికి తోడు వైద్యం అందడంలో జాప్యం ఫలితంగా.. చికిత్సకు స్పందించే పరిస్థితి దాటిపోవడంతో మరికొంతమంది చనిపోయారని తెలిపారు. సోమవారం మృతిచెందిన 12 మంది శిశువుల్లో కొందరు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చిన వారున్నారు. మిగిలిన వారు పలు కారణాలతో మరణించారని మహారాష్ట్ర వైద్య విద్య, పరిశోధన విభాగం సంచాలకుడు దిలీప్‌ మైశేఖర్‌ వెల్లడించారు.

మరోవైపు ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మహారాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ నాందేడ్‌కు బయలుదేరారు. ప్రతి మరణంపై దర్యాప్తు చేస్తామని.. ఏదైనా నిర్లక్ష్యంగా తేలితే ఎవరినీ వదలమని, ఇందుక కారణమైన వారు శిక్షించబడతారని మంత్రి పేర్కొన్నారు.

Tags:    

Similar News