Sharad Pawar: శరద్ పవార్ పార్టీ పేరును ఖరారు చేసిన ఎన్నికల సంఘం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యంలోని వర్గాన్ని అసలైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి)గా ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో శరద్ పవార్ వర్గాన్ని తమ వర్గానికి కొత్త పేరును సూచించాలని కోరింది. దీంతో శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్‌సిపి వర్గం బుధవారం ఎన్నికల సంఘానికి మూడు పేర్లు, చిహ్రాలను సమర్పించింది. శరద్ పవార్ వర్గం సమర్పించిన పేర్లలో.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- శరద్‌చంద్ర పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ -శరద్‌రావు పవార్, ఎన్సీపీ-శరద్ పవార్ పేర్లు ఉండగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పార్టీకి ‘నేషనలిస్ట్ కాంగ్రెస్‌పార్టీ- శరద్‌చంద్ర పవార్’ పేరును ఖరారు చేసింది.
నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని ఈసీ ప్రకటించి, ఎన్నికల చిహ్నం ‘గడియారం’ని అజిత్ పవార్ వర్గానికే కేటాయిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈసీ నిర్ణయంపై అజిత్ పవార్ వర్గం సంబరాలు చేసుకుంటే.. శరద్ పవార్ వర్గం ఈ నిర్ణయాన్ని ‘‘ ప్రజాస్వామ్య హత్య’’ అభివర్ణించింది. ఈసి నిర్ణయాన్ని తాము సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని శరద్ పవార్ వర్గం ప్రకటించింది. తన నిర్ణయానికి ఈసి సిగ్గుపడాల్సి ఉంటుందని శరద్ వర్గం వ్యాఖ్యానించింది. తన సొంత బాబాయ్, ఎన్‌సిపి వ్యవస్థాపకుడు శరద్ పవార్‌ను అజిత్ పవార్ రాజకీయంగా దెబ్బతీశారని ఆరోపించింది. గతేడాది అజిత్ పవార్ ఎన్సీపీలో చీలిక తీసుకువచ్చారు. ఆ తర్వాత శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని అజిత్ పవార్ తీసుకున్నారు. పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ వెంట 12మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం.