వీర్యం తారుమారు..ఆస్పత్రికి 1.5కోట్ల జరిమానా

Update: 2023-06-27 03:53 GMT

ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి భారీ జరిమానా పడింది. ఆస్పత్రి నిర్వాహకులు చేసిన పనికి 1.5 కోట్ల జరిమానా పడింది. కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన మహిళకు ఆమె భర్త వీర్యం బదులు మరొకరి వీర్యాన్ని ఎక్కించడమే ఈ జరిమానాకు కారణం. అసిస్టెట్‌ రిప్రొడక్టివ్‌ టెక్నిక్‌ (ఏఆర్‌టీ) విధానంలో సంతానం కోసం దంపతులు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. ఈ ప్రక్రియ ద్వారా 2009 జూన్‌లో వారికి కవలలు జన్మించారు. అయితే పిల్లలకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా.. వారి తండ్రి అతడు కాదని తేలింది.

వేరే వ్యక్తి వీర్యంతో వారు జన్మించినట్లు డీఎన్ఏ టెస్ట్ ద్వారా స్పష్టమైంది. దీంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ ను ఆశ్రయించారు. తమకు ఆస్పత్రి యాజమాన్యం 2కోట్ల నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు. సుదీర్ఘ విచారణ తర్వాత వారికి అనుకూలంగా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

దంపతులకు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాలని ప్రైవేట్‌ ఆసుపత్రిని ఆదేశించింది. ప్రైవేట్‌ హాస్పిటళ్లలో కృత్రిమ గర్భధారణ వల్ల జన్మించిన ప్రతి శిశువు డీఎన్‌ఏ ప్రొఫైల్‌ను తయారీ చేసి ఇచ్చేలా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్‌ అభిప్రాయపడింది. కమిషన్ ఉత్తర్వులపై ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగుకుండా చూడాలని అధికారులకు కోరారు. 




Tags:    

Similar News