తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మహరాష్ట్ర పర్యటనపై ఆ రాష్ట్ర నేతలు అభ్యంతరం చెబుతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు సంధించగా మరో దిగ్గజ నేత, ఎన్సీపీ అధినాయకుడు శరద్ పవార్ కూడా తప్పుబట్టారు. కేసీఆర్ 600 వాహనాలతో మహారాష్ట్రకు బలప్రదర్శన చేస్తూ రావడం సరికాదని అన్నారు. ఎన్సీపీ చోటా నేత ఒకరు బీఆర్ఎస్‌లో చేరడం కూడా ఆయన కోపానికి కారణంగా కనిపిస్తోంది.
‘‘ఆలయంలో పూజలు చేసుకోవడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, భారీ బలప్రదర్శతో రావడం మాత్రం మంచింది కాదు. కేసీఆర్ బలప్రదర్శనకు బదులు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం కోసం ప్రయత్నించి ఉండాల్సింది’’ అని శరద్ పవార్ అన్నారు. కేసీఆర్ భారీ కాన్వాయ్‌తో సోలాపూర్ వెళ్లడం అక్కణ్ని పండరీపూర్‌లోని ప్రఖ్యాత విఠలేశ్వరుడి ఆలయాన్ని సందర్శించుకోవడం తెలిసిందే. తర్వాత నిర్వహించిన బీఆర్ఎస్ సభలో ఎన్సీపీ నేత భగీరథ్ భాల్కే గులాబీ కండువా కప్పుకున్నారు. భగీరథ్ తమ పార్టీని వీడి వెళ్లడం వల్ల తమకొచ్చిన నష్టమేమీ లేదని పవార్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చి తప్పుచేశామని, దీని గురించి మాట్లాడడం దండగని అన్నారు.