Ayodhya : అయోధ్యలో మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చింది..?

Byline :  Krishna
Update: 2024-01-22 04:46 GMT

అయోధ్యలో రాముని ఆలయం.. వందల ఏళ్ల హిందువుల కల. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతతో హింస చెలరేగింది. రాముని స్థలంలో మసీదు కట్టారని హిందువుల ఆరోపణ. ఎన్నో ఏళ్ల న్యాయపోరాటం తర్వాత 2019లో అయోధ్యలోని వివాదస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో మసీదు నిర్మాణానికి భూమిని కేటాయించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో యూపీ సర్కార్ అయోధ్యకు 26 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్లో 5ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

మరికొన్ని గంటల్లో అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ క్రమంలో మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చిందనే ఆసక్తిగా మారింది. అయితే ధన్నీపూర్ వెళ్తే ఖాళీగా ఉన్న భూమే స్వాగతం పలుకుతోంది. ఇక్కడ మసీదు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. వక్ఫ్ బోర్డును ఈ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అయోధ్య వివాదంలో ముస్లింల తరుపు పిటిషనర్ ఇక్బాల్ అన్సారీ తెలిపారు. మసీదు నిర్మించడం, నిర్మించకపోవడం ఆ బోర్డు ఇష్టమని చెప్పారు. దానిని ముస్లీంలు ప్రశ్నించరని అన్నారు.

రెండు నియమాల ఉల్లంఘన..

ఇండియన్ మిల్లీ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఖాలిక్ అహ్మద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తీర్పు తమ మతంలో రెండు నియమాలను ఉల్లంఘించిందన్నారు. అందులో మొదటిది వక్ఫ్ నియమాలు కాగా రెండోది ఖురాన్ ఆధారిత షరియా నియమాలను ఉల్లంఘించినట్లు చెప్పారు. వక్ఫ్ రూల్ ప్రకారం మసీదులు, స్మశనాలు లాంటి వక్ఫ్ ఆస్తులను అమ్మకూడదు, తనఖా పెట్టకూడదు, గిఫ్ట్ ఇవ్వడం, ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వడం వంటివి చేయొద్దని చెప్పారు. కానీ సుప్రీం బాబ్రి మసీదుకు ప్రత్యామ్నాయంగా ఈ స్థలాన్ని ఇచ్చిందని.. అందుకే ముస్లింలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెప్పారు.

బాబ్రీకి ప్రత్యామ్నాయం కాదు

ఇండో ఇస్లామిక్ ఫౌండేషన్ సెక్రటరీ అథర్ హుసస్సేన్ సుప్రీం తీర్పుపై క్లారిటీ ఇచ్చారు. మసీదు నిర్మాణం కోసం ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. తమకు ఇచ్చిన బాబ్రీ మసీదుకు ప్రత్యామ్నాయం కాదని అథర్ హుసస్సేన్ స్పష్టం చేశారు. ఇక్కడ కొత్త మసీదు కట్టుకోవడానికి స్థలం ఇచ్చారని చెప్పారు. నిధుల వల్లే మసీదు నిర్మాణం ఆలస్యమవుతోందన్నారు. గతంలో రూపొందించిన డిజైన్ సైతం మార్చామని.. మసీదుతో పాటు ఆస్పత్రి, మ్యూజియాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొత్త డిజైన్ పూర్తికాగానే రెండు, మూడు నెలల్లో టైం షెడ్యూల్ చెప్తామని చెప్పారు. 

Tags:    

Similar News