న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఉపా చట్టం కింద ప్రబీర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ సహా చైనాకు అనుకూల ప్రచారం చేస్తుందనే ఆరోపణలు రావడంతో ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం పలువురు జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. డిజిటల్ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఈడీ ఇచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.
న్యూస్‌క్లిక్ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం రాసింది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నెవిల్ రాయ్‌సింగం నుంచి గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్ నిధులు పొందినట్టు ఆ కథనంలో వివరించింది. దీంతో ఉపా చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. మంగళవారం ఉదయం న్యూస్‌క్లిక్ ఆఫీస్‌తో పాటు ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లు సహా మొత్తం 30 చోట్ల సోదాలు నిర్వహించారు.
జర్నలిస్టుల ఇళ్లలో సోదాలను కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఖండించాయి. బిహార్ కులగణనతో వంటి విషయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్ పెరుగుతోందని, దీన్ని కప్పిపుచ్చేందుకు దాడులు జరుపుతున్నారని కాంగ్రెస్ మండిపడంది. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సైతం ఈ దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలతో ఓ ప్రకటన విడుదల చేస్తామని చెప్పింది.