Budget-2024 :ట్యాక్స్ పేయర్ల సొమ్ము దేశాభివృద్ధికి..వికసిత భారతే లక్ష్యం
(Budget-2024) బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ చెల్లించేవారికి ఆశించినరీతిలో ప్రకటనలేవీ చేయలేదు. ఇకపై పన్ను చెల్లింపు సులభతరం అవుతుందన్నారు. కొత్త ట్యాక్స్ విధానంలో 7 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేకుండా మినహాయింపు ఉంటుందని, ప్రత్యక్ష, పరోక్ష పన్ను చెల్లింపులో మార్పులేవీ లేవన్నారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడురెట్లు పెరిగాయన్నారు. ఆదాయ పన్ను శ్లాబులు యధాతథంగా ఉంటాయన్నారు. కార్పోరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.
ట్యాక్స్ పేయర్ల సొమ్మును దేశాభివృద్ధికి వినియోగిస్తామని నిర్మలమ్మ అన్నారు. జీఎస్టీ విధానం ప్రయోజనకరంగా ఉందన్నారు. జీఎస్టీ ద్వారా ఒకే దేశం, ఒకే పన్ను విధానాన్ని పాటిస్తున్నామన్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని, పన్ను చెల్లింపుదారులను అభినందిస్తున్నామన్నారు. అలాగే నూతన సంస్కరణలో కొత్త పరిశ్రమలు వచ్చాయని, నిరుద్యోగుల శాతం తగ్గిందని తెలిపారు. స్టార్టప్ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తున్నామన్నారు.
2047 నాటికి అసమానత, పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆర్థిక భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించడమే తమ విజన్ అని నిర్మలా సీతారామ్ అన్నారు. వికసిత భారత్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రధాని ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని పేదలు, మహిళలు, యువత, అన్నదాతపై మరింత దృష్టి సారించామన్నారు. ముద్రా యోజన ద్వారా యువతకు ఇప్పటి వరకూ రూ.25 లక్షల కోట్ల రుణాలను అందించినట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద రెండు కోట్ల ఇళ్లను నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.