విపక్ష కూటమికి ఇండియా పేరు.. నితీష్ కుమార్ షాక్..!

Update: 2023-07-19 07:39 GMT

వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్షాలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా రెండు రోజులపాటు బెంగళూరులో ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి 26 పార్టీలు హాజరై బీజేపీని మట్టికరిపించే అంశాలపై మంతనాలు జరుపాయి. విపక్షాల కూటమికి కొత్తగా ఇండియా అనే పేరును కూడా పెట్టారు. రాహుల్ గాంధీ ఈ పేరును ప్రతిపాదించగా మిగితా పార్టీలు ఏకాభిప్రాయంతో సమ్మతించాయని తెలుస్తోంది.

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ మాత్రం కూటమి పేరును తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఇతర పార్టీల నేతలు సర్దిచెప్పడంతో చివరకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల కూటమి పేరుపై కాంగ్రెస్‌ ముందుగా ఎలాంటి చర్చలు జరపలేదట. విపక్షాల భేటీ సమయంలో ఉన్నట్టుండి ఇండియా అనే పేరును హస్తం పార్టీ నేతలు ప్రతిపాదించడంతో నీతీష్ కుమార్‌ షాక్‌ అయ్యారని తెలుస్తోంది.

‘‘ప్రతిపక్షాల కూటమికి ఇండియా అనే పేరు ఎలా పెడతారు..? పైగా ఇందులో బీజేపీకి చెందిన కూటమి అక్షరాలున్నాయి’’ అని బిహార్‌ సీఎం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కొందరు లెఫ్ట్‌ పార్టీ నేతలు కూడా ఈ పేరుపై సంకోచించి.. ప్రత్యామ్నాయ పేర్లను సూచించినట్లు సమాచారం. అయితే అత్యధిక పార్టీలు ఈ పేరును ఆమోదించడంతో నీతీశ్ కూడా అంగీకరించక తప్పలేదని సదరు వర్గాలు తెలిపాయి.

ఇండియా అంటే..I - ఇండియన్ N - నేషనల్ D - డెవలప్మెంటల్ I - ఇన్క్లూసివ్ A - అలియెన్స్ అని అర్ధం. అయితే తొలుత ఇందులోని డి అనే అక్షరానికి డెమోక్రటిక్‌ అని ప్రతిపాదించారు. ఎన్డీయేలో డి అక్షరానికి అదే అర్థం ఉన్నందువల్ల దీనిని డెవలప్‌మెంటల్‌గా మార్చారు. అలా చివరకు విపక్షాల కూటమికి ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌ పేరును ఖరారు చేశారు.

Tags:    

Similar News