HCA Election : అజహరుద్దీన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

By :  Kiran
Update: 2023-10-09 17:40 GMT

టీమిండియా మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకోలేమని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధులియా ధర్మాసనం స్పష్టం చేసింది.

హెచ్‌సీఏలో అంబుడ్స్‌మెన్‌, ఎథిక్స్‌ అధికారి నియామకంలో తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు 2022 ఆగస్టులో జస్టిస్‌ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవలే విచారణ పూర్తి చేసిన కమిటీ అక్టోబర్ 20న జరిగే హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అజహరుద్దీన్పై అనర్హత వేటు వేసింది. ఓటర్ల జాబితా నుంచి అతడి పేరును తొలగించింది. ఏకకాలంలో అటు హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే.. ఇటు డెక్కన్‌ బ్లూస్‌ క్రికెట్‌ క్లబ్‌కూ అధ్యక్షుడిగా కొనసాగాడనే కారణంతో అతనిపై వేటు వేసినట్లు ప్రకటించింది.

జస్టిస్ లావు నాగేశ్వర్ రావు కమిటీ నిర్ణయంపై అజహరుద్దీన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసోసియేషన్‌ ఎన్నికల ప్రక్రియ మొదలైందని, ఈ దశలో డిబార్‌ చేయడం సబబు కాదని పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఓటు వేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై స్పందించిన ధర్మాసనం ప్రస్తుత దశలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.

Tags:    

Similar News