జమిలి ఎన్నికల అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సారి జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే కేంద్రం ఓ కమిటీని వేసింది. అదేవిధంగా లా కమిషన్ సైతం వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఎన్నికల ముందు కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. అయితే 2024లో జమిలి ఎన్నికలు సాధ్యం కావని లా కమిషన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. రాజ్యాంగంలోని ప్రస్తుత అధికరణలను సవరించకుండా జమిలి ఎన్నికలు నిర్వహించలేరని చెప్పినట్లు సమాచారం.
ప్రజాప్రాతినిధ్య చట్టం - 1951లో సంబంధిత ప్రొవిజన్లను సవరించాలని సిఫారసు లా కమిషన్ చేసింది. లా కమిషన్ 2022 డిసెంబర్ 22న ఆరు ప్రశ్నలను రాజకీయ పార్టీలు, భారత ఎన్నికల కమిషన్, బ్యూరోక్రాట్లు, నిపుణుల ముందు ఉంచింది. ప్రస్తుతం దీనిపై కసరత్తు జరుపుతున్న లా కమిషన్, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ నివేదకను కేంద్రానికి అందజేయనుంది.
మరోవైపు జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్రం ఓ కమిటీ వేసింది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ నివేదిక రూపొందించనుంది.
ఇటీవలె ఈ కమిటీ తొలిసమావేశం జరిగింది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికలపై అభిప్రాయాల సేకరించడంతో పాటు రాజకీయపార్టీల సూచనలు స్వీకరించాలని డిసైడ్ అయింది.వాళ్టి భేటీలో కమిటీ జమిలి ఎన్నికలపై అభిప్రాయాల సేకరణ కోసం దేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలతో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను సైతం ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. వీరితో పాటు పార్లమెంట్‌లో ప్రతినిధులుగా ఉన్న రాజకీయ పార్టీలకూ ఆహ్వానం పంపనున్నారు.