భర్త బతికుండగానే వితంతువుగా ప్రవర్తన.. హైకోర్టు ఏం చెప్పిందంటే,,
ప్రమాదంలో గాయపడి మంచానపడ్డ భర్తకు సేవ చేయాల్సిందిపోయి బతికున్నా చనిపోయినట్లే అనుకుని ఓ మహిళ వితంతువుగా మారింది. తాను బతికుండగానే తాళికట్టిన భార్య కళ్ల ముందు విదవగా తిరుగుతుంటే ఆ భర్తకి ఇంతకుమించిన నరకం మరొకటి ఉంటుందా?, నుదుటి బొట్టు తీసేసి.. గాజులు కూడా వేసుకోకుండా, తెల్లని వస్త్రాలను ధరించి.. తన భార్య ప్రత్యక్ష నరకం చూపించిందని.. ఓ భర్త తీవ్ర మనోవేదనతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.
అసలు కథ ఏంటంటే.. ఢిల్లీకి చెందిన ఓ జంట 2009లో వివాహం చేసుకున్నారు. 2011లో వీరికి ఓ కూతురు పుట్టింది. పాప పుట్టిన కొన్ని రోజులకే ఆ మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇంటి పనులు చూసుకోవడానికి ఆ వ్యక్తికి ఎంతో కష్టమైంది. ఆ వ్యక్తి తండ్రే కొన్ని పనులు చేసి పెట్టేవాడు. అయితే ఓసారి భర్త ఇంట్లో కాలు జారి పడిపోయాడు. అతనికి తీవ్రంగా గాయం అవడంతో వైద్యులు కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.అయితే అప్పటికే ఇంటికి వచ్చిన భార్య భర్తకు అనారోగ్యంగా ఉంటే చూసుకోవాల్సిందిపోయి నదుటన కుంకుమ, గాజులు తీసేసి తెల్ల చీర కట్టుకుని తన భర్త చనిపోయినట్లుగా విదవగా మారిపోయింది. బయటికి కూడా అలాగే వెళ్తుండడంతో ఆ భర్త తట్టుకోలేక తనకు విడాకులు కావాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో వాదోపవాదాలు విన్న హైకోర్టు జడ్జిలు జస్టిస్ సురేశ్ కుమార్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ.. ‘‘తాను జీవించి ఉండగా భార్య వితంతువుగా నటించడం ఏ భర్తకైనా దారుణమైన అనుభవం. అదీ తాను తీవ్రంగా గాయపడినప్పుడు అలా జరిగితే ఇంకా బాధ కలిగిస్తుంది. గాయపడి ఇబ్బందులు పడుతున్నప్పుడు భార్య నుంచి ఏ భర్తైన కాస్త శ్రద్ధ, దయ, జాలి ఆశిస్తాడు. ఇందుకు విరుద్ధంగా పిటిషనర్/భార్య ప్రవర్తించడం తీవ్రమైన క్రూరత్వమే’’ అని తెలిపారు. భర్తకు అనుకూలంగా కుటుంబ కోర్టు విడాకులు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ భార్య వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. భర్త పట్ల ఆమె క్రూరంగా ప్రవర్తించిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఓ భర్తకు తాను బతికుండగానే భార్య విదవగా తిరగడాన్ని చూసి తట్టుకోవడం కంటే మరో నరకం ఉండదని చెప్తూ ఇద్దరికీ విడాకులు మంజూరు చేసారు. ఇలాంటి మహిళల వల్ల సమాజానికి మచ్చ వస్తోందని మండిపడ్డారు.