ఒడిశా రైలు ప్రమాదం ఎఫెక్ట్.. విమాన ఛార్జీలకు రెక్కలు

Update: 2023-06-09 12:34 GMT

ఒడిశా రైలు ప్రమాదం తర్వాత విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి. ఊహించని డిమాండ్‌తో ఛార్జీలు పైపైకి పోయాయి. ఏకంగా 2 నుంచి 3 రెట్లు విమాన ఛార్జీలు అధికమవ్వడం ప్రయాణికులకు భారంగా మారింది. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్.. విశాఖ పట్టణం నుంచి ఢిల్లీ మార్గాల్లో టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోతున్నాయి.

జూన్ 2 న ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటికి దారి మళ్లిలించారు. దీంతో ఐదారు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్జెంట్ వెళ్లాల్సి ఉండడంతో విమానాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన విమానయాన సంస్థలు టికెట్ రేట్లను అమాంతం పెంచేశాయి. వన్ స్టాప్ విమానాల ధరలు భారీగా పెరిగాయి. జూన్ 9, 10 తేదీల్లో విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు డైరెక్ట్ విమానాల్లోని మొత్తం టికెట్లు అమ్ముడవ్వడం విశేషం. సాధరణ రోజుల్లో విశాఖ పట్టణం నుంచి హైదరాబాద్‌కు రూ. 4 వేల నుంచి రూ. 5 వేల మధ్య ఉండగా.. అదే ధర శుక్రవారం రూ.16 వేల నుంచి రూ. 22 వేలకు చేరింది. శనివారం ఆ ధర రూ. 10 వేల నుంచి రూ. 12,500 మధ్య ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత శుక్రవారం బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి 7:20 సమయంలో ఊహించని ప్రమాదం సంభవించింది. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ రైలు ప్రమాదంలో 288 మంది మరణించారు. వెయ్యికి పైగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం రెస్కూ బృందాలు తీవ్రంగా శ్రమించాయి. 51 గంటల ఆపరేషన్ అనంతరం ట్రాక్‎ను పునరుద్ధరించారు.


Tags:    

Similar News